ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు రెండున్నరేళ్ల కిందటే జుగుప్సాకరమైన స్థితికి చేరుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ను అంతమొందించి అయినా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పొందాలనుకుంటున్నారనే ఆరోపణలు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. వారంతటికి వారు ఇలా అనే అవకాశం లేదు. వారు అలామాట్లాడాలని పార్టీ ముఖ్యుల నుంచి సంకేతాలు వస్తాయి. ఆ విషయం వైసీపీలో అందరికీ తెలుసు. మొదటగా పలు హత్య కేసులు ఉన్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ను చంద్రబాబు హత్య చేసి అయినా సీఎం కావాలనుకుంటున్నారని ఆరోపించారు. దీనికి ఆయన బేస్ ఎక్కడ వెదుక్కున్నారంటే తెలంగాణలో టీఆర్ఎస్ కార్పొరేటర్ అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీలపై చేసిన వ్యాఖ్యలను వెదుక్కున్నారు. ఆ అంశం సహజంగానే ఏపీలో కలకలం రేపుతోంది . ఈ క్రమంలో దాన్ని జగన్కు మళ్లిస్తున్నారు వైసీపీ నేతలు. తోపుదుర్తి అంటే రౌడీషీటర్ కాబట్టి అలాంటి ఆలోచనలు వచ్చాయేమో అనుకున్నా.. వెంటనే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా అవే అందుకున్నారు. అంటే వ్యూహాత్మకంగా ఇలా వైసీపీ నేతలు ప్రారంభించారన్నమాట. దీనికి టీడీపీ నేతలు వెంటనే కౌంటర్ ఇచ్చారు.
కోతికత్తి, గొడ్డలిపోటు తరహాలో ఏదో ప్లాన్ చేసుకుంటున్నారని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నిజంగా అలా ఆలోచించే వారైతే.. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అంత ప్రశాంతంగా ఎలా తిరగగలిగారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే ముందు ముందు ఏపీ రాజకీయం.. హత్యల చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటికే అధికారం అండతో మానసికంగా వేధించి ప్రత్యర్థుల్నిచంపుతున్నారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. అందుకే ఏపీ రాజకీయాలు మరీ దారుణంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.