విశ్వసుందరి కిరీటం కోసం 21 ఏళ్లు కొనసాగిన నిరీక్షణకు తెరపడింది. మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకుంది. ఇజ్రాయెల్లో జరిగిన 70వ మిస్ యూనివర్స్-2021 పోటీల్లో 21 ఏళ్ళ హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుపొందింది. దీంతో 21 ఏండ్ల తర్వాత భారత్కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కినట్లయింది. గతంలో సాధించిన సుస్మితా సేన్(1994), లారా దత్తా(2000) మిస్ యూనివర్స్ టైటిల్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
హర్నాజ్ సంధు పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి. మోడలింగ్, వెండితెరపై ఆసక్తితో ఆమె విద్యార్థి దశలోనే ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేసింది. అందంతో పాటు తెలివితేటలకూ పరీక్ష పెట్టే మిస్ యునివర్స్ పోటీల్లో హర్నాజ్ కౌర్ సందేశం ఆకట్టుకుంది. ”ప్రపంచంలో యువత ఒక పెద్ద సమస్యని ఎదురుకుంటుంది. పక్కవారితో పోల్చుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. పోల్చుకోవడం ఆపేయండి. మిమ్మల్నీ మీరు నమ్మండి. ఈ రోజు నేను మీ ముందుకు ఉండటానికి కారణం నన్ను నేను నమ్మడమే. ఇక్కడ మనమంతా యూనిక్. మీ జీవితానికి మీరే హీరో” అని హర్నాజ్ ఇచ్చిన సందేశం ఆకట్టుకుంది.