సినిమా టిక్కెట్ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎవరు మాట్లాడతారో స్పష్టత లేకుండా పోయింది. నిన్నటి వరకూ ప్రతి అంశంలోనూ ఏపీ మంత్రిపేర్ని నాని మీడియా ముందుకు వచ్చేవారు. సినిమావాళ్లుపోయినా ఆయనే వెళ్లి నివాళులు అర్పించేవారు. అయితే అప్పటి వరకూ ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ అధికారికంగా లేదు. కానీ ఆయనకు ఇటీవలే ఆ శాఖను సీఎం జగన్ కేటాయించారు. ఇక శాఖ లభించింది కాబట్టి ఇక అధికారికంగా ఆయన అన్నీ ప్రకటిస్తారేమో అనుకునేంతలో హఠాత్తుగా తెర మీదకు బొత్స సత్యనారాయణ వచ్చారు. హీరో నాని ఏపీ సినిమా టిక్కెట్ల ధరలపై కటువైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించకపోయినా ఆ అర్థం వచ్చేలా వ్యాఖ్యలుచేశారు. దీనికి ప్రభుత్వం తరపున కౌంటర్ ఇచ్చేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ తెర ముందుకు వచ్చారు. ఇష్టం వచ్చినట్లుగా సినిమా టికెట్ రేట్లుపెంచుకుంటామంటే అంగీకరించేది లేదని భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు సినిమా టిక్కెట్ల వివాదానికి బొత్సకు సంబంధం ఏంటో ఎవరికీ తెలియదు.. ఆయనకుఈ సమస్యపై అవగాహన ఉందో లేదో కూడా తెలియదు. కానీ తెర ముందుకు వచ్చి భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సినిమా ధియేటర్ల లో సోదాల గురించి అడిగితే ఆయన సమాధానం చెప్పలేకపోయారు. సోదాలు జరుగుతున్నాయో లేదో ఆయనకు క్లారిటీ లేదు.
కానీ జర్నలిస్టులు అడిగే సరికి. జరుగుతున్నాయి కాబోలు అనుకుని… కావాలని చేస్తున్నవి కాదని రాజకీయ నాయకుడు తరహాలోచెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు..పరిశ్రమ వర్గాలను సైతం నివ్వెరపరుస్తోంది. ఎందుకు ఇంతకక్ష సాధింపునకుపాల్పడుతున్నా..కొన్ని వేల మంది ఉపాధిపై ఎందుకు దెబ్బకొడుతున్నారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. కొంత మందిపై పగ తీర్చుకోవడం కోసం.. ఇలా ఎలా చేస్తారని విస్మయం సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.