జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సోము వీర్రాజు అనవసరంగా ఆవేశపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కల్యాణ్ ఉద్యమం చేస్తున్నారు. అయితే ఆయన ఎక్కడా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. ఎంపీలు కనీసం పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ నేతలకు బాగా నొప్పి పుట్టింది. పవన్ ను చెడామడా తిట్టేశారు. అయితే ఇప్పుడు బీజేపీ నేతలు ముఖ్యంగా ప్రో వైసీపీ నేతలకు కూడా ఈ విషయంలో నొప్పి కలుగుతోంది.
వారు కూడా మిత్రపక్షం అయిన జనసేనను ప్రశ్నిస్తూ..పవన్ కల్యాణ్‌ను నిలదీస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..పవన్ కల్యాణ్ ఒక్క స్టీల్ ప్లాంట్ అంశంపైనే మాట్లాడటం సరి కాదని.. ప్రస్తుత..గత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థలగురించి కూడా మాట్లాడాలని డిమాండ్ చేసినట్లుగా మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఒక్కటే కనిపిస్తోందా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు సందర్భం లేకపోయినా పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించడం జనసేన వర్గాలను సైతం నివ్వెరపరిచింది.
అసలు కేంద్రాన్ని.. బీజేపీని పవన్ ఎక్కడా ఓ మాట అనకపోయినా… ఆ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ… భరిస్తున్నా… అదేమి పట్టించుకోకుండా సోము వీర్రాజు విమర్శలు చేయడం జనసేన నేతల్లో చర్చకు కారణం అవుతోంది. ఇతర బీజేపీ నేతలు కూడా స్పందిస్తే..బీజేపీ పవన్ విషయంలో ప్రత్యేకమైన ఎజెండా తో వెళ్తోందన్న అభిప్రాయానికి రావొచ్చని భావిస్తున్నారు. సోము వీర్రాజు.. పవన్ ను ప్రశ్నించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న పరిస్థితి ఉందన్న అభిప్రాయం కల్పించారు. ఇది తఏ వైపు వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది.