చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్వీ రమణ కృష్ణా జిల్లాలోని సొంత గ్రామానికి వెళ్తున్నారు. మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఓ కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకంగా సీజేఐ ఎన్వీ రమణకు ప్రభుత్వం ఇందిరాగాంధీ స్టేడియంలో తేనీరు విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారు. ఈ తేనీరు విందుకు సీజేఐ ఎన్వీ రమణతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు కూడా హాజరవుతున్నాయి.
క్రిస్మస్ రోజున పులివెందులలో ఉదయం ప్రార్థనలు పూర్తి చేసుకుని మధ్యాహ్నానికి తాడేపల్లి చేరుకోనున్న జగన్..సాయంత్రం పూట ఇందిరగాంధీ స్టేడియంకు వెళ్తారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో.. సీఎం జగన్ సీజేఐని సన్మానించే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన కార్యక్రమంలో ఇలాంటి సన్మాన కార్యక్రమం ఉన్నట్లుగా చెప్పలేదు. కానీ మంత్రులను సీజేఐకి.. ఇతర న్యాయమూర్తులకు జగన్ పరిచయం చేస్తారన్న కార్యక్రమం ఉంది. ప్రభుత్వం పారదర్శకంగా ఉండే విషయంలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి…అక్కడ ప్రభుత్వం తరపున సన్మానం లాంటివి పెట్టుకునే అవకాశం ఉండటానికే ఎక్కువ చాన్స్ ఉందని భావిస్తున్నారు.
సీజేఐగా ఎన్వీ రమణ అవకూడదన్న ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనపైనే తప్పుడు ఆరోపణలు చేస్తూ అప్పటి చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. తర్వాత నిబంధనలకు విరుద్ధంగా మీడియా ద్వారా బయట పెట్టారు. ఎన్వీ రమణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలువురితో ఓ రకమైన ప్రచారం కూడా నిర్వహింప చేశారు. సీజేఐ అయిన తర్వాత తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు ప్రోటోకాల ప్రకారం స్వాగతం కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ప్రభుత్వ తరపున తేనీటి విందును… ఎన్వీ రమణ స్వగ్రామంలో జరిగే పౌర సన్మానానికి మంత్రులను పంపించడం.. ఆసక్తికరంగా మారింది.
సీఎం జగన్ .. సీజేఐకి సన్మానం చేస్తే సోషల్ మీడియాలో పరి పరి విధాలా చర్చ జరగడం ఖాయం. ఎన్నో కేసుల్లో నిందితుడు.. అంతకు మించి తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తి సన్మానం చేయడం… సీజేఐ దానికి అంగీకరిస్తే ఇంకా అనేక చర్చలు జరుగుతాయి. అందుకే సీజేఏ ఏపీ పర్యటన ఆసక్తి రేపుతోంది.