ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అంటే స్పెషల్ అట్రాక్షన్. గతంలో వైఎస్ ఉన్నప్పుడు పులివెందులకు ఎంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశారో అక్కడి ప్రజలకు బాగా తెలుసు. సీఎం జగన్ వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో పనులు జరుగుతాయని ఆశించారు. సీఎం జగన్ కూడా వారిని ఎప్పుడూ నిరాశపరచలేదు. సీఎం అయిన తొలి ఏడాది క్రిస్మస్ పండుగకు వెళ్తున్నప్పుడు.. కనీసం రూ. రెండు వేల కోట్ల విలువైన పనుల ప్రకటనలు చేశారు. జీవోలిచ్చారు. వెళ్లినప్పుడల్లా శంకుస్థాపనలు చేశారు.
జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్లే ప్రతీసారి పులివెందులకు నిధుల కేటాయింపు ఉంటుంది. ఆయన వైఎస్ జయంతి, వర్థంతి, క్రిస్మస్ పండుగలకు ఎక్కువగా వెళ్తూంటారు. ఈ సందర్భాలలో జీవోలు వెల్లువెత్తుతూంటాయి. ఓ సారి దాదాపుగా 30 వరకూ జీవోలు విడుదల చేశారు. ఆ పనుల మొత్తం విలువ పదమూడు వందల కోట్లు. ఆ తర్వాత పులివెందుల ప్రాంతంలో తాగునీటి సరఫరాకు రూ. 480 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రి, వేంపల్లి సీహెచ్‌సీకి రూ.30 కోట్లతో మౌలిక సౌకర్యాలు .. పులివెందుల మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీకి పులివెందులలో మెట్రో స్థాయిలో మిని శిల్పారామం, ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ … జాతీయ స్ధాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్ధ ఏర్పాటు.. అలాగే… భారీ మాల్ మల్టిప్లెక్స్ ఇలా చాలా ప్లాన్లు జగన్ ప్రకటించారు.
ఇప్పుడు వాటి పనులు ఎక్కడ ఉన్నాయా అని ఆరా తీస్తే ఇంకా జీవోల్లోనే ఉన్నాయని తేలింది. చివరికి పులివెందులకు బస్ స్టేషన్ లేదని.. ప్రపంచస్థాయి బస్ స్టాండ్ నిర్మిస్తామని.. విమానం ఆకారంలో ఉన్న గ్రాఫిక్‌ను మీడియాకు వదిలారు. ఆ నిర్మాణంలో ఇంత వరకూ కదలిక రాలేదు. పునాదులు వేసి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ వెళ్లిపోయారు. ఒక్కటంటే ఒక్క పనీ ముందుకు సాగడం లేదు. శంకుస్థాపనలు శిలాఫలకాలకే పరిమితమవుతున్నాయి. చివరికి బద్వేలు ఉపఎన్నికల సందర్భంగా ఆ నియోజకవర్గానికి కూడా వందల కోట్ల పనుల మంజూరు చేశారు. పులివెందులకు రాని నిధులు.. బద్వేలుకొస్తాయా ? అందుకే జగన్ తీరు విమర్శల పాలవుతోంది.