వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఏకతాటిపై ఉంచడంలో సీఎం జగన్ విఫలవుతున్నారు. గతలో వైఎస్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులందరూ పులివెందుల చేరుకుని చర్చలు జరిపారని.. ఓ పరిష్కారం అయిందని చెప్పుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి వైఎస్‌కు నివాళులు అర్పించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే అప్పుడు చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడంతో ఇప్పుడు మరోసారి కుటుంబసభ్యుల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చినట్లుగా కనిపిస్తోంది.
క్రిస్మస్ పండుగ మూడు రోజులు వైఎస్ కుటుంబం అంతా కలసిమెలిసి చేసుకుంటుంది. అందు కోసం ఈ సారి కూడా బుధవారం సాయంత్రానికల్లా అందరూ పులివెందుల చేరుకున్నారు. కానీ ఏం జరిగిందో కానీ షర్మిలా ఇలా వచ్చి అలా హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. విజయమ్మ, జగన్ వేర్వేరుగా వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తర్వాత ప్రార్థనల్లో కలిసి పాల్గొన్నారు. కానీ వారు చెరో వైపు కూర్చున్నారు. కనీసం మాట్లాడుకున్నట్లుగా కూడా ఎక్కడా కనిపించలేదు. ఈ పరిణామాలు పులివెందుల వాసుల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
వైఎస్ జగన్‌తో మాట్లాడేందుకు తల్లి విజయలక్ష్మి కూడా ఆసక్తి కనబర్చకపోవడంతో తీవ్రమైన విభేదాలే వచ్చాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. షర్మిల కుటుంబ పరంగా జరుగుతున్న ఏ విషయన్నీ బయటకు చెప్పడం లేదు. ఎంత అన్యాయం జరిగిందని తనలో తాను ఫీలై.. దూరం జరుగుతున్నారు కానీ బయటపడటం లేదు. కానీ ఇప్పుడు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనకుండా పులివెందుల వచ్చి మరీ తిరిగి వెళ్లిపోవడం మాత్రం చిన్న విషయం కాదని చెప్పుకుంటున్నారు.
వైఎస్ ఫ్యామిలీ ఇప్పుడు రెండు వర్గాలుగా మారిపోయింది. అవినాష్ రెడ్డి వైపు ఫ్యామిలీ మాత్రమే జగన్ వైపు ఉంది. మిగిలిన వారు అంతా జగన్‌కు దూరంగానే ఉంటున్నారు. దీంతో కుటుంబం మొత్తం కలిపి ఉంచడంలో జగన్ విఫలమయ్యారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.