కేసీఆర్‌కు ఫాం హౌస్ అంటే ఎంత ఇష్టమో… ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరైనా ఫాంహౌస్‌పై విమర్శలు చేసినా సహించరు. ఫాంహౌస్‌ను దున్నిస్తానన్న బండి సంజయ్‌ను ఆయన ఎలా తిట్టారో ఇంకా సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఏ పంట వేశారో చూస్తామని.. ఆ గ్రామంలో రైతులతో మాట్లాడతామని ఆయన ప్రకటించారు. 27వ తేదీని ముహుర్తంగా ఖరారు చేశారు.
డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు రైతులంతా ఎర్రవెల్లికి రావాలని.. టీపీసీసీ ముఖ్యనేతలంతా ఇందులో పాల్గొంటారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా కేసీఆర్, మోడీ ఒక్కటేనని వివరిస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఎజెండా రైతు సమస్యే అయినా… తెలంగాణలో ఉన్న పోటాపోటీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా రేసులోకి తీసుకు రావాలో రేవంత్ రెడ్డి బాగా ఆలోచించి వేసిన ప్లాన్‌గా అభివర్ణిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ కావాలనే కాంగ్రెస్‌ను సైడ్ చేసే లా రాజకీయాలు చేస్తున్నాయని.. దాన్ని ఎదుర్కోవాలంటే కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసే విధంగానే రాజకీయం చేసేందుకు డిసైడయ్యారని తెలుస్తోంది.
ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలంటే అందుకు ఆయన వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లిలో కార్యక్రమం నిర్వహించడమే కరెక్ట్ అనే నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ వైపు ఎవర్నీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటారు. అసలు ఎర్రవెల్లి గ్రామానికి పంపిస్తారా అనే డౌట్ కూడా ఉంది. అందుకే ఇరవై ఏడో తేదీన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఫామ్‌హౌస్‌లో ఓ యువకుడి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది కూడా వివాదాస్పదమవుతోంది.