నవలల్ని సినిమాలుగా తెరకెక్కించే సంప్రదాయం ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. క్రిష్ తీసిన `కొండపొలెం` నవలా చిత్రమే. ఇప్పుడు క్రిష్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. `కన్యాశుల్కం`తో. తెలుగు సాహిత్యంలోనే మకుటాయమానమైన నవల… కన్యాశుల్కం. గురజాడ అప్పారావు రాసిన ఈ నవల… నాటకంగానూ ప్రసిద్ధి. పాత్రలన్నీ అజరామరాలు. డైలాగులు కూడా చాలామందికి గుర్తే. ఇప్పుడు ఈ నవలని తెరకెక్కించబోతున్నాడు క్రిష్. అయితే ఈసారి ఓటీటీ కోసం. సోనీ లీవ్ కోసం కన్యాశుల్కంని ఓ వెబ్ సిరీస్ గా తీయబోతున్నాడు క్రిష్. రచన, దర్శకత్వ పర్యవేక్షణకు మాత్రం క్రిష్ పరిమితం కాబోతున్నాడు. దర్శకత్వ బాధ్యత ఎవరికి అప్పగిస్తాడో చూడాలి. ఇప్పటికే స్క్రిప్టు పూర్తయ్యిందని సమాచారం. నిజానికి కన్యాశుల్కం నవలకు ఇప్పటికీ అభిమానులున్నారు. వెబ్ సిరీస్ గా తీయాలన్న ఆలోచన మంచిదే. ఈ ప్రయత్నం హిట్టయితే… మరిన్ని నవలలు వెబ్ సిరీస్‌లుగా రూపాంతరం చెందరడం తథ్యం.