కొత్త ఏడాదిలో తెలంగాణలో సరికొత్త రాజకీయం కనిపించబోతోంది. టీఆర్ఎస్ను కార్నర్ చేయడానికి హిందూత్వ అంశాలు ఎక్కడ దొరుకుతాయా అని ఎదురు చూసే బీజేపీకి.. స్వయంగా కేటీఆర్ ఓ అస్త్రం అందించారు. ఆ అస్త్రమే మునావర్ ఫారుఖీ. కొద్ది రోజుల కిందట కేటీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బెంగళూరులో స్టాండప్ కమెడియన్ల షోలను కూడా రద్దు చేస్తున్నారని… కానీ హైదరాబాద్ ట్రూలీ కాస్మోపాలిటన్ అని.. తాము అలా రద్దు చేయబోమన్నారు. ఇలా షోలు రద్దయిన ఇద్దరు స్టాండప్ కమెడియన్లు కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీలను ఆయన హైదరాబాద్‌లో షోలు చేయాలని ఆహ్వానించారు.
ఇప్పుడు మునావర్ ఫారుఖీ నిజంగానే హైదరాబాద్‌లో షోలు ఏర్పాటు చేశారు. నిండా 30 ఏళ్లు కూడా ఉండని స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ అంటే బీజేపీ నేతలకు ఎక్కడ కాలుతుందో చెప్పలేం. ఎందుకంటే ఆయన బీజేపీని.. బీజేపీ విధానాల్ని.. బీజేపీ హిందూత్వ ఎజెండాను తన కామెడీషోలో కామెడీగానే ఎండగడతారు. చూసేవాళ్లంతా పగలబడి నవ్వుతారు. తమ విధానాల్ని నవ్వుల పాలు చేసే వ్యక్తి పట్ల బీజేపీ ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది. గతంలో ఓ షో మధ్యలో ఉండగానే అరెస్ట్ చేయించారు. తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయనను ఏ బీజేపీ పాలిత రాష్ట్రామూ షోలు చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. బీజేపీయేత ప్రభుత్వాలున్న చోట మాత్రమే షోలు చేస్తున్నారు.
ఆయన ఎక్కడ షో ఉన్నా అడ్డుకుంటామని బీజేపీ నేతలు, హిందూత్వ సంఘాలు ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇక హైదరాబాద్‌లో ఆయన షో ఉంటే ఊరుకుంటారా..? ఇప్పటికే రాజాసింగ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరికలు జారీ చేస్తూ ప్రకటనలు చేశారు. హైదరాబాద్‌లో మునావర్ షోను జరగనివ్వబోమని చెబుతున్నారు.మునావర్ వచ్చే నెల 9వ తేదీన హైదరాబాద్ వస్తున్నారు. ఆ లోపు బీజేపీ ఎంత కావాలంటే అంత హిందూత్వ రాజకీయం చేసుకుంటుంది . కేటీఆర్ స్వయంగా ఫారుఖీని ఆహ్వానించి.. కొత్త రాజకీయం కష్టం తెచ్చుకున్నారన్న అభిప్రాయం కొంత మందిలో వినిపిస్తోంది.