రైతులు ఢిల్లీ సరహద్దుల నుంచి వెళ్లిపోయిన తర్వాత కేంద్రం కొత్త ఫిట్టింగ్ పెడుతోంది. మళ్లీ వ్యవసాయ చట్టాలను తెస్తామని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం లేక చట్టాలను వెనక్కి తీసుకున్నా రైతులు ఆందోళన విరమించలేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా అనేక అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. వారు అడిగిన డిమాండ్లన్నింటినీ రాత పూర్వకంగా అంగీకారం తెలిపిన కేంద్రం.. వారితో నిరసన మాన్పించగలిగింది. దీంతో బీజేపీ వచ్చే ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది.
ఇటీవలే ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులందరూ వెనుదిరిగారు. స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి మళ్లీ చట్టాలు తెస్తామని ప్రకటిస్తున్నారు. అడుగు వెనకకు వేశామంటే.. మూడు అడుగులు ముందుకు వేస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఆయన మాటలు సహజంగానే సంచలనంగా మారాయి. రైతుల్ని వెన్నుపోటు పొడిచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏ రూపంలో వ్యవసాయ చట్టాలు తీసుకు వచ్చినా మళ్లీ రైతుల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. వరుసగా రాష్ట్రాల ఎన్నికలు ఉండటం.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ అదే పరిస్థితి ఉండటంతో.. ఈ టర్మ్‌లో మళ్లీ వ్యవసాయ చట్టాల గురించి ఆలోచించరని..మళ్లీ మూడోసారి అధికారం చేపడితే తీసుకు వస్తారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.