నిన్నామొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ కాస్త యాక్టివ్‌గా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. కాస్త ఊపు వచ్చిందనుకునేలోపు బీజేపీ, టీఆర్ఎస్ వరి యుద్ధంలోకి దిగి అటెన్షన్‌ను తమ వైపు మళ్లించుకున్నాయి. అది సద్దుమణిగే సరికి.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి రైతుల పేరుతో రచ్చబండ అంటూ కొత్త కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నేరుగా సీఎం నియోజకవర్గ గజ్వేల్ నుంచి ప్రారంభించాలని డిసైడవడంతో అందరి దృష్టిదానిపై పడింది. అయితే అనూహ్యంగా పోలీసులు హౌస్ అరెస్టులతో భగ్నం చేశారు. నిజానికి రాజకీయ కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోరు. కానీ కాంగ్రెస్ నేతల్ని మాత్రం ఎక్కడిక్కకడ అరెస్ట్ చేస్తున్నారు.
గజ్వేల్ అంటే సీఎం నియోజకవర్గం కాబట్టి సరే పోలీసులు బాధ్యత ఫీలయ్యారని అనుకుందాం.. కానీ ఇతర చోట్ల కూడా అదే పరిస్థితి ఎందుకనేది ఎవరికీ అర్థం కాని విషయం.. వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహించాలని రేవంత్ రెడ్డి డిసైడయ్యారు. కానీ ఆయనను పోలీసులు అర్థరాత్రి నుంచే కనిపెట్టుకుని ఉన్నారు. ఇంటి చుట్టూ మోహరించారు. అసలు బయటకు వెళ్లడానికి కూడా అంగీకరించలేదు . ఇలా ఎందుకు ఆపుతున్నారు.. కారణం ఏమిటన్నదానిపైనా పోలీసుల నుంచి స్పందన లేదు.
దీంతో రేవంత్ రెడ్డి అక్రమ నిర్బంధంపై లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఎన్ని ఫిర్యాదులు చేసినా.. రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా నిలువరిస్తున్నారన్న అభిప్రాయం మాత్రం జనంలోకి వెళ్తోంది. ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించే వాళ్లు ఎక్కువ అవుతున్నారు. బీజేపీ మాత్రమే ప్రత్యర్థిగా ఉండాలనుకుని ఆ పార్టీకి టీఆర్ఎస్ నేతలు ఎలివేషన్లు ఇస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీని మాత్రం అప్రజాస్వామికంగా అణిచి వేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇది పీసీసీ చీఫ రేవంత్‌కు ఓ సవాల్ లాంటిదే. ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.