తెలంగాణ బీజేపీని అధికారంలోకి తెచ్చే బాధ్యతను స్వయంగా అమిత్ షా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది . ఆయన తన టీమ్లను రంగంలోకి దించినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో బండి సంజయ్ పాదయాత్ర సమయంలో ఓ సారి అమిత్ షా టీం వచ్చి పరిస్థితిని అంచనా వేసి వెళ్లింది. జనవరి మొదటి వారంలో మరోసారి అమిత్ టీం వచ్చి పర్యటనలు చేసి ఒక నివేదికను కేంద్ర నాయకత్వానికి సమర్పించనున్నారు. ఆ తర్వాత అసలు కార్యాచరణ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అమిత్ షా వ్యూహాల్లో మొదటిది చేరికలు. ఏ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలనుకున్నా అమిత్ మాత్రం ముందుగా నేతల్ని చేర్చుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో చేరికలపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోది. ముఖ్యంగా రిజర్వ్డ్ సీట్లపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్నదానిపై రాష్ట్ర నేతలు ఓ నివేదికను సైతం సిద్ధం చేశారు. అభ్యర్థులను ముందే గుర్తించి.. బలాలు, బలహీనతలను తెలుసుకొని వాటిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలనేదానిపై అమిత్ షా టీం తదుపరి నివేదిక సిద్ధం చేస్తుంది.
ఫిబ్రవరి మొదటి వారం కల్లా పార్టీ శ్రేణులకు యాక్షన్ప్లాన్పై దిశానిర్దేశం జరిగే అవకాశం ఉంది . ధాన్యం కొనుగోళ్లపై రైతులు పడుతోన్న ఇబ్బందులు, దళితబంధు, నిరుద్యోగ సమస్య, 317 జీవో ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులు ఇలా అన్ని అంశాల్లోనూ టీఆర్ఎస్పై వ్యతిరేకత ఉండటంతో దాన్ని ఎలా తమకు అనుకూలంగా మల్చుకోవాలన్నదానిపైనా బీజేపీ ఎక్కువ దృష్టి పెడుతోంది.