ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సినీ పరిశ్రమను శుత్రవుగా డిక్లేర్ చేశారు. అయితే వ్యూహాత్మకంగా తనకు శత్రువుగా కాకుండా.. ఆయన పేదలను అడ్డం పెట్టుకున్నారు. సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించడాన్ని కూడా విమర్శిస్తున్న వారందరూ పేదలకు శత్రువులంటూ కొత్త సిద్ధాంతం ఆవిష్కరించారు. పెన్షనర్లకు రూ. 250 పెంచే పథకాన్ని రూ. కోట్లు పెట్టి ప్రచారం.. పండుగలా చేస్తున్న ఆయన ఆ సభా వేదికపైనే సినిమా ఇండస్ట్రీ గురించి ప్రస్తావించారు. పేదలకు అందుబాటులోకి తేవడానికి సినిమా టిక్కెట్ రేట్లను తగ్గిస్తే దాన్ని కూడా విమర్శిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
సీఎం జగన్ వ్యాఖ్యలతో టాలీవుడ్‌కు ఇప్పటికైనా ఓ క్లారిటీ వచ్చి ఉండాలి. సినిమా టిక్కెట్ రేట్లను బతిమాలితే పెంచే అవకాశమే లేదని.. కోర్టు చెప్పిందని కమిటీ వేశారు కానీ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ .. తన ప్రతి పనికి పేదలను అడ్డు పెట్టుకోవడంలో రాటు దేలిపోయారు. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు.. చివరికి పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లతో పోలిస్తే ఏపీలో దాదాపుగా రూ. పదిహేను ఎక్కువగా ఉంటున్నా.. అదేమీ పేదలకు భారం అనిపించడం లేదు కానీ.. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడాన్ని ప్రశ్నించే వారిని మాత్రం ఆయన శత్రువులుగా ప్రకటించారు.
ప్రైవేటు వ్యక్తులు.. ప్రైవేటు పెట్టుబడితే తీసే సినిమాలకు ఎమ్మార్పీ నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. కానీ టిక్కెట్ రేట్ల విషయంపై ప్రభుత్వం రూ. ఐదు .. పది టిక్కెట్ రేట్లను నిర్ణయించడంతో ఆ ఇండస్ట్రీ ఇక ఏపీపై ఆశలు వదులుకునే పరిస్థితి ఉంటుంది. ధియేటర్లపై ఆధారపడిన వారు.. సినిమా ఇండస్ట్రీ కూడా దెబ్బతిని పోవడం ఖాయంగా కనిపిస్తోంది.