ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైందని.. రెండున్నరేళ్ల తర్వాత రూ. 250 పెన్షన్ పెంచి ఐదు రోజుల పండుగ నిర్వహిస్తున్న వైనం.. పేపర్ ప్రకటనలు.. ఇతర బిల్డప్పులు చూసి అందరూ విమర్శిస్తూంటే.. సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం ప్రచారం సరిగ్గా చేసుకోవడం లేదనే ఆవేదన కనిపిస్తోంది. గొప్పగా పరిపాలిస్తున్నప్పటికీ ప్రచారం సరిగ్గా చేసుకోలేకపోతున్నామని …కానీ పథకాలు అందుకున్న వారు మౌత్ పబ్లిసిటీ చేస్తారన్న నమ్మకంతో ఉన్నామని ఆయన కవర్ చేసుకున్నారు.
జగన్ పాలనకు నేటితో 30 నెలలు పూర్తయిందని ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ముఫ్పై నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న సవాళ్లను వాటిని ఆయన అధిగమించి బటన్లు నొక్కిన వైనాన్ని వివరించారు. ప్రజాసేవకు పునరంకితం అవుతున్నామని గొప్ప భారం మోస్తున్న ఫీలింగ్తో చెప్పుకొచ్చారు. 30 నెలల కాలంలో రూ. లక్షా పదహారు వేల కోట్లను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేశామని.. దేశ చరిత్రలోనే ఇలా చేయడం తొలిసారి అని సజ్జల ప్రకటించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్షా 30వేల ఉద్యోగాలు కల్పించామని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు.
క్యాలెండర్ ప్రకారం పోస్టులు భర్తీ చేస్తున్నా ప్రచారం చేసుకోకలేకపోతున్నామని.. బాధ్యతగా ఉద్యోగాలు మాత్రం కల్పిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా ప్రతీ ఏటా ఇబ్బంది పెడుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలలు మాత్రం ఒకింత వెసులుబాటుతో పాలించిన జగన్.. ఆ తర్వాత ఎదురైన సవాళ్లను తట్టుకుంటూ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో కానీ సచివాలయ ఉద్యోగులు ఇంకా పర్మినెంట్ చేయలేదని ఎదురు చూస్తున్నారు.
నిజంగా ప్రభుత్వం ప్రచారంలో వెనుకబడి ఉన్నట్లయితే పూర్తిగా బాధ్యత వహించాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డినే. మొత్తంగా… ప్రచార బాధ్యతలు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి. అక్కడ ఫెయిలైతే ఆయన ఫెయిలయినట్లే. ఈ విషయాన్ని ఆయన అంగీకరిస్తారా అని వైసీపీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.