కరోనా కారణంతో.. ఆర్.ఆర్.ఆర్ వెనక్కి వెళ్లిపోయింది. నిజానికి ఆర్.ఆర్.ఆర్ నిర్మాతల చేతుల్లో కూడా ఏం లేదు. థియేటర్లన్నీ వరుసగా మూతపడుతూ పోతుంటే, నైట్ కర్ఫ్యూ సమస్య ఉన్నప్పుడు ఆర్.ఆర్.ఆర్ ఎలా రాగలదు? పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు, అన్ని చోట్లా సాధారణమైన పరిస్థితులు ఉండి తీరాలి. అవి లేనప్పుడు ఆర్.ఆర్.ఆర్.. ఎలా వస్తుంది?
అయితే రాధే శ్యామ్ మాత్రం అనుకున్న సమయానికే వస్తుందని చిత్రబృందం ప్రకటించింది. అదెలా కుదురుతుందన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్లానే.. రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా చిత్రమే. మిగిలిన భాషల్లో ఆర్.ఆర్.ఆర్కి మంచి వసూళ్లు రావడం ఎంత కీలకమో.. రాధే శ్యామ్ కీ అంతే కీలకం. ముంబైలో ప్రభాస్సినిమా మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? సాహో దక్షిణాదిన పెద్దగా ఆడలేదు. కానీ ఉత్తరాదిన మాత్రం రికార్డు వసూళ్లు సాధించింది. ఆ అంచనాలే.. రాధే శ్యామ్ పైనా ఉన్నాయి. అలాంటప్పుడు.. ముంబైలో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల దృష్ట్యా.. రాధే శ్యామ్ ని ఎలా విడుదల చేస్తారు?
జనవరి 14న రాధే శ్యామ్ రావడం ఖాయమని చెబుతున్నా.. 14న ఆ సినిమా రాదన్న ఉద్దేశ్యంతో కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. డీజే టిల్లు జనవరి 14న వస్తోంది. గంటా అశోక్ నటించిన హీరో కూడా జనవరి 15న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. రాధే శ్యామ్ సినిమా వస్తుంటే… ఈ మీడియం రేంజు సినిమాలు ఎందుకు రిస్క్ చేస్తాయి?