మొన్న సుబ్బారావు గుప్తా.. ఇవాళ కొండ్రెడ్డి. ఎవరైనా సరే వైసీపీని విమర్శిస్తే సహించే ప్రశ్నే లేదని సందేశం పంపించేశారు. ఎంత సీరియస్గా అంటే… ఏ మని విమర్శలు చేశారో.. అదే తరహాలో ట్రీట్మెంట్ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో కొండ్రెడ్డి అనే వైసీపీ నేత గురించే ఇదంతా. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై గీతారెడ్డి అనే జడ్పీటీసీ భర్త కొండ్రెడ్డి తిరుగుబాటు చేశారు. ఆయన నియోజకవర్గంలో తాలిబన్ పాలన చేస్తున్నారని… పెద్దిరెడ్డి అనుచరులు ఆడవాళ్లను చెరపడుతున్నారని.. తప్పుడు కేసులతో ఇరికిస్తున్నారని ఆరోపించారు.
ఆయన మాటలు మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత ఏం జరిగిందో కానీ చిత్తూరు జిల్లా పోలీసులు ప్రెస్మీట్ పెట్టి మీడియాకు సమాచారం ఇచ్చారు. ఓ నొటోరియస్ క్రిమినల్ను పట్టుకున్నామని … మీడియా సమావేశం పెట్టి వివరాలు చెబుతామన్నారు. అందరూ వెళ్లారు. ముసుగు వేసిన ఓ వ్యక్తిని నిలబెట్టి.. అతని చుట్టూ ముగ్గురు పోలీసుల్ని నిలబెట్టారు. ఇద్దరు అధికారులు కూర్చుని వివరాలు చెప్పారు. అతని పేరు మద్దిరెడ్డి కొండ్రెడ్డి అని చెప్పే సరికి జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. కానీ పోలీసులు మాత్రం తాము చెప్పాలనుకున్నది చెప్పుకుంటూ పోయారు.
ఎప్పుడో 1996నుంచి చాలా కేసులు నమోదయ్యాయని 2008లో ఇళ్ల పట్టాల పేరుతో ఏడుగుర్ని మోసం చేశారన్న కేసులు నమోదయ్యాయని అందుకే రాత్రికి రాత్రి విచారణ జరిపి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఎప్పటి కేసులో ఇప్పుడు చూపించి.. ఇంత అవమానకరంగా అరెస్ట్ చూపించిన ఆ క్రిమినల్… వైసీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేసిన ఆ నేత ఒక్కరే. ఆయనే కొండ్రెడ్డి. సొంత పార్టీ అని .. కనీసం సొంత సామాజికవర్గం అని కూడా చూడకుండా తాలిబన్ పాలన ఎలా ఉంటుందో చూపించారు. పోలీసుల్ని వాడుకుని రాజకీయం చేయడంలో పెద్దిరెడ్డి సోదరులు ఎలా వ్యవహరిస్తారో ఇదే అతి పెద్ద ఉదాహరణ అని చిత్తూరు జిల్లా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.