ఏపీలో గత రెండు, మూడు నెలలుగా జీతాలు, పెన్షన్లకు పెద్దగా ఇబ్బంది రాలేదు. సామాజిక పెన్షన్లకూ ఈ సారి కటకట ఏర్పడింది. ప్రతీ నెలా ఒకటో తేదీన ఉదయం ప ది గంటల కల్లా.. 90 శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేశామని ప్రభుత్వంతో పాటు ఆయన మీడియా గొప్పలు చెప్పుకునేది. కానీ ఈ సారి మాత్రం ఒకటో తేదీన అంతా గప్ చుప్. ఎందుకంటే సామాజిక పెన్షన్లు కూడా పూర్తి స్తాయిలో పంపిణీ చేయలేదు. ఏడు జిల్లాల్లో అసలు ప్రారంభం కాలేదు. మొత్తంగా ముఫ్పై శాతమే పంపిణీ చేశారు. ఐదు రోజుల పాటు పంపిణీ చేస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ లబ్దిదారులు మాత్రం ఎప్పట్లాగే ఇస్తారని ఆశపడ్డారు. నిరాశకు గురయ్యారు.
ఎప్పుడూ లేనిది సామాజిక పెన్షన్లకే ఇబ్బంది వచ్చింది. ఇక జీతాల, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్లకు మాత్రం గుడ్ న్యూస్ ఉంటుందా..? సచివాలయంలో పని చేసే వారికి కూడా ఈ సారి ఒకటో తేదీన పూర్తి స్థాయిలో జీతాలు రాలేదు. ఆదివారం బ్యాంకులకు సెలవు. సోమవారం అయినా ఉద్యోగులకు జీతాలు , రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు వస్తాయన్న ఆశ లేదు. ఎందుకంటే మళ్లీ మంగళవారం రావాలి. ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకోవాలి. అప్పుడే చెల్లింపులు సాధ్యమవుతాయి.
ఏపీ ప్రభుత్వం ఓడీ సహా అన్ని రకాల సౌకర్యాలను ఉపయోగించేసుకుంది. వాటికి చెల్లింపులు చేస్తూ..మళ్లీ తీసుకుంటూ వస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెలలకు కేంద్రం కొత్తగా అప్పులు తీసుకోవడానికి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఆ అనుమతులు ఏ క్షణమైనా వస్తాయని.. ఆ తర్వాత ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుని జీతాలు, పెన్షన్లు ఇస్తామని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. మళ్లీ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై.. కొత్త అప్పులు తీసుకునేందుకు అనుమతులువచ్చే వరకూ ఈ టెన్షన్లు తప్పవేమో..?