ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు తక్కువ ధరకు వినోదం అందిస్తూంటే విమర్శలు చేస్తున్నారని సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించడం గురించి చెబుతున్నారు. అయితే ఆయనకు అన్ని వైపుల నుంచి అనేక రకాల ప్రశ్నలు వస్తున్నాయి. పేదలకు వినోదం సంగతి సరే ముందు కడుపు నింపే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా ? అని. కడుపు నిండితేనే ఎవరైనా వినోదం గురించి ఆలోచిస్తారు. .. లేకపోతే ముందుగా కడుపు నింపుకోవడమే ప్రాధాన్యతగా చూస్తారు. ప్రభుత్వం చేయాల్సింది కూడా పేదవాడి కడుపుకు ఇంత అన్నం పెడుతున్నామా లేదా అనే కానీ వినోదం ఇస్తున్నామా లేదా అని కాదు.
ప్రస్తుతం దేశంలో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలూ ఎక్కువే. దేశంలో జీవన వ్యయం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ముందు ఉంది. ఉప్పులు, పప్పులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువ. చివరికి ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏపీ ఒకటి. ఓ వైపు ఆదాయం లేదు.. మరో వైపు అత్యధిక ధరలు ఉన్న ఉన్న రాష్ట్రం ఏపీ. ఇక ప్రభుత్వం పన్నుల బాదుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చివరికి ఎప్పుడో దశాబ్దాల కిందట ఇచ్చిన ఇళ్లకు కూడా ఇప్పుడు సెటిల్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. చెత్త పన్నులని.. అవని.. ఇవని అందరి దగ్గర వసూళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేనా కొత్తగా రోడ్డెక్కితే ట్రాపిక్ చలానాలు.. మాస్క్ లేకపోతే ఫైన్లు పేరుతో డబ్బు సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అసలు సామాన్య ప్రజలు.. పేదలకు కష్టాలు అంటే ఇవి. వీటి గురించి ఆలోచించాలి కానీ సినిమా గురించి ఏంటో సీఎం జగనే అర్థం చేసుకోవాలి. తమ ప్రతి రాజకీయానికి పేదల్ని అడ్డం పెట్టుకోవడమే కాదు.. కాస్త వారికి మేలు చేసే ప్రయత్నం అయినా చేయాలి. వారి పొట్ట కొట్టకూడదు. దీన్ని అర్థం చేసుకుంటారో లేదో మరి..!