ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ … రెండూ పాన్ ఇండియా సినిమాలని… వాటికి చోటివ్వాలన్న మంచి ఉద్దేశ్యంతో.. భీమ్లా నాయక్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. తీరా చూస్తే… ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడింది. రాధే శ్యామ్ అయితే వాయిదాకీ, విడుదలకు మధ్య ఊగిసలాడుతోంది. వీటి కోసం పక్కకెళ్లిన భీమ్లా నాయక్ రావొచ్చు కదా అన్నది ఫ్యాన్స్ ఆలోచన. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే ట్రెండింగ్. భీమ్లా నాయక్ ఈ సంక్రాంతికి రావాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
అయితే భీమ్లా నాయక్ ఈ సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లోనూ రాదు. జనవరి 12న ఈసినిమాని విడుదల చేయాలన్న కసితో… చిత్రబృందం అహర్నిశలూ శ్రమించింది. ఎప్పుడైతే.. ఫిబ్రవరి 25కి వెళ్లిపోయిందో, అప్పుడు టీమ్ రిలాక్స్ అయ్యింది. ఫిబ్రవరి అంటే దాదాపు రెండు నెలల సమయం దొరికింది. అందుకే తాయితీగా పనులు చేసుకుంటూ వెళ్తోంది. సడన్ గా ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడడం వల్ల భీమ్లా నాయక్ కి ఒరిగేదేం లేదు. ఇదే ముక్క ఓ వారం రోజుల ముందే తెలిస్తే.. పరిస్థితి వేరుగా ఉండేది. భీమ్లా నాయక్ కి సంబంధించి ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. అహర్నిశలూ కష్టపడినా సంక్రాంతికి తీసుకురాలేని పరిస్థితి. కాబట్టి.. ఫిబ్రవరి 25 వరకూ ఆగాల్సిందే.
ఇదంతా చూస్తుంటే.. భీమ్లా నాయక్ కి అనవసరంగా వాయిదా వేయించారే.. అన్న ఫీలింగ్ రాకపోదు. ఆర్.ఆర్.ఆర్ తో ముందు నుంచీ ఇదే సమస్య. `మేమొస్తున్నాం.. తప్పుకోండి` అని మిగిలిన సినిమాల్ని ఇబ్బంది పెట్టడం, తీరా తప్పుకున్నాక.. ఆర్.ఆర్.ఆర్.. రాకపోవడం. ఇదే జరుగుతోంది. ఈ సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ రాకపోవడం వల్ల ఆ సినిమాకే కాదు.. మిగిలిన సినిమాలకూ చాలా నష్టం వాటిల్లింది. ఇక వేసవి రేసులో ఆర్.ఆర్.ఆర్ వచ్చినా – మిగిలిన సినిమాల్ని పక్కకు తప్పుకోమని అడిగే ఛాన్స్…రాజమౌళి బృందానికి లేకపోవొచ్చు.