తెలుగు సినీ పరిశ్రమకు తాను పెద్దను కానని.. ఆ పదవి తనకు వద్దని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. పంచాయతీలు తాను చేయలేనని తెలిపారు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున సినీ కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించారు. ఆ పత్రాలను అందించే కార్యక్రమంలో మాట్లాడిన చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు కొట్టుకుంటుంటే వారి మధ్య పంచాయతీ తీర్చేందుకు తాను ముందుకు రానన్నారు. అయితే సినిమా కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని చెప్పారు చిరంజీవి. కార్మికుల కోసం తాను ఏదో ఒకటి చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. బాధ్యతగా ఉంటానని, సమస్యలు వస్తే సాయం చేస్తానన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ అనేక సమస్యలతో ఉంది. తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి సమస్యలు లేనప్పటికీ ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరిలో టాలీవుడ్ పూర్తి స్థాయి సంక్షోభంలో కూరుకుపోతోంది. టిక్కెట్ రేట్ల అంశంపై ఇటీవలే చిరంజీవి రంగంలోకి దిగుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయనకు ఎలాంటి అపాయింట్మెంట్లు లభించలేదని తెలుస్తోంది. దీంతో ఇండస్ట్రీ పెద్ద అనే భావనే తనకు అవసరం లేదని చిరంజీవి డిసైడయినట్లుగా కనిపిస్తోంది.
నిజానికి మా ఎన్నికలకు ముందు సినిమా ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిని గుర్తించిన ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయనకు ఫోన్లు చేసి .. సీఎంతో చర్చలకు రావాలని పిలిచింది. ఆ త్రవాత వాళ్లు ఏం అడిగారో… ఇండస్ట్రీ ఏం చెప్పిందో కానీ దూరం మాత్రం ఆమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో మా ఎన్నికలు వచ్చాయి. చిరంజీవి బలపరిచిన ప్యానల్ ఓడిపోయింది. ఆ తర్వాత కూడా వివాదం మరింత ముదిరింది కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఇక తాను జోక్యం చేసుకోబోనని చిరంజీవి నేరుగా స్పష్టం చేయడంతో ఇక టాలీవుడ్ తరపున ఎవరు ముందుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.