టిక్కెట్ రేట్ల అంశం టాలీవుడ్‌ను వణికిస్తున్నప్పటికీ “మా” ఎన్నికల్లో విజయం సాధించి.. సీఎం జగన్‌తో దగ్గరి బంధుత్వం ఉందని ప్రచారం చేసుకున్న మంచు ఫ్యామిలీ మాత్రం స్పందించలేదు. అదేదో తమకు సంబంధం లేని వివాదం అన్నట్లుగా ఉన్నారు. అయితే ఇండస్ట్రీ అనాథగా మారిపోవడం.. చిరంజీవి కూడా తాను ఎలాంటి పంచాయతీల్లోనూ తలదూర్చబోనని చెప్పడంతో .. అందరూ మంచు ఫ్యామిలీ వైపే చూస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తప్పని సరిగా స్పందించాల్సిన పరిస్థితి రావడంతో మోహన్ బాబు స్పందించారు.
టిక్కెట్ రేట్ల పెంపు అంశంలో ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతానన్నారు . టిక్కెట్ రేట్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. మోహన్ బాబు.. లేఖ రాయడానికి.. చర్చలు జరపడానికి అవసరమైన కటాఫ్ తేదీ ఎప్పుడో ముగిసిపోయింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే కమిటీని నియమించారు. ఆ మేరకు కమిటీ ఓ సారి సమావేశం అయింది. ఏమీ తేల్చలేదు. ఇవన్నీ తెలియనట్లుగా మోహన్ బాబు కంటి తుడుపుగా లేఖ రాస్తానని చెప్పడం టాలీవుడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
టిక్కెట్ రేట్ల పెంపు.. తగ్గింపు అంశంలో టాలీవుడ్ ఏకాకిగా మారింది. ఎవరూ బాధ్యత తీసుకుని ప్రభుత్వంతో చర్చించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సినిమా ఇండస్ట్రీ సంక్షోభం అంచున పడినట్లయింది. ఇక థియేటర్ రిలీజులు కన్నా ఓటీటీలే మంచిదన్న భావనకు వస్తున్నట్లుగా చెబుతున్నారు