ప్రతిపక్షాలు విమర్శిస్తేనే తట్టుకోలేని అధికార పార్టీ నేతలు సొంత పార్టీ వాళ్లు నోరెత్తితే ఊరుకుంటారా..? మా పార్టీ వాళ్లే కదా అనుకునే మనస్థత్వం ఆ పార్టీలో లేదని సుబ్బారావు గుప్తా, కొండ్రెడ్డి వంటి వారి ఉదాహరణలతో తేలిపోయింది. పార్టీ అన్యాయం జరిగిందని ఎవరైనా నోరెత్తితే అదే ట్రీట్ మెంట్ వస్తుందన్న సందేశం కోసమే వారితో అలా డీల్ చేశారన్న అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే వైసీపీలో ధిక్కార స్వరాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా పాయకరావు పేటలో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ద్వితీయశ్రేణి నేతలు రోడ్డెక్కారు.
పాయకరావు పేట నుంచి ఎమ్మెల్యేగా బాబూరావు ఉన్నారు. ఆయన గెలుపు కోసం తాము ఎంతో కష్టపడినా తమ వైపు ఇప్పుడు చూడటం లేదని..చేయి తడపందే పనులు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బొలిశెట్టి గోవింద్ అనే ఎంపీటీసీ ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహింప చేస్తున్నారు. పార్టీ అవినీతిపై తీవ్ర మైన ఆరోపణలు చేస్తున్నారు.
తంబళ్లపల్లె జడ్పీటీసీ భర్త చెప్పినట్లుగానే ఆయన కూడా జగన్ కోసం బాబూరావు ను గెలిపించామని.. ఇప్పుడు మోసం చేశారని అంటున్నారు. బాబూరావు వద్దు జగన్ ముద్దు అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఈ క్రమంలో ఇప్పుడు బొలిశెట్టి గోవింద్ పరిస్థితి ఏమిటి అన్నదనిపై వైసీపీలో చర్చ జరుగుతోంది. అయితే సుబ్బారావు గుప్తా, కొండ్రెడ్డి వ్యవహారాల్లో అక్కడ ఎమ్మెల్యేలుగా అధికార పార్టీ కీలక సామాజికవర్గ నేతలని.. పైగా జగన్కు దగ్గర వాళ్లని.. కానీ పాయకరావుపేట మాత్రం రిజర్వ్ నియోజవవర్గం కాబట్టి పెద్దగా పట్టించుకోరన్న అంచనా ఉంది.