ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త ఏడాదిలో అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశంపై.. పోలవరంపై… విభజన హమీలపై చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు..వైసీపీ వర్గాలు అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఎన్నో సార్లు సమావేశం అయ్యారు. అన్ని సార్లూ అదే చెప్పారు. ఎప్పుడు కేంద్ర పెద్దలతో భేటీ అయినా ఒకే రకమైన ప్రెస్‌నోట్ విడుదలవుతుంది. ఈ సారి భేటీ కి ముందే వాటి గురించి చెబుతున్నారు. భేటీ తర్వాత కూడా అదే విడుదల కావొచ్చు. ఎందుకంటే లోపల జరిగే సమావేశంలో మాట్లాడే ఇతర అంశాల గురించి బయటకు చెప్పుకోలేరు.
ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి చాలా సమస్యలు ఉన్నాయి. అందులో మొదటిది ఆర్థిక సమస్యలు. ఇప్పటికిప్పుడు ఆర్బీఐ నుంచి తీసుకునే బాండ్ల అప్పుల కోసం అనుమతి రావాల్సి ఉంది. ఇవాళ అది రాకపోతే మంగళవారం ఆర్బీఐ వేసే బాండ్ల వేలంలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. అదే జరిగితే ఇప్పటికీ జీతాలు, పెన్షన్లు అందని వారికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలనేది పెద్ద సమస్య అవుతుంది. ముందు ఈ గండం అధిగమించాలి. తర్వాత ఎలాగూ ఇతర సమస్యలు ఉండనే ఉన్నాయి. మెల్లగా వివేకానందరెడ్డి హత్య కేసు రాజకీయ సమస్యలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వీటన్నింటి నుండి బయటపడాల్సి ఉంది.
ఇప్పటికే సీబీఐ పైనే ఎదురుదాడి చేస్తున్నారు. ఆరోపణలు..పోలీసులకు ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఇవన్నీ కేంద్రానికి తెలియకుండా ఏమీ ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరమే. అయితే.. రియల్ ఎజెండా ఏమిటి.. లోపల ఏం చర్చించారు.. ఎలాంటి నిర్ణయాలు జరిగాయి అన్నదానిపై మాత్రం అధికారికంగా ఎప్పటికీ స్పష్టత రాదు. తర్వాత జరగబోయే పరిణామాలను బట్టి ఓహో అలా జరిగిందా అని అనుకోవడమే.