టిక్కెట్ల వివాదాన్ని ఎటూ తేల్చకుండా చేసి ఈ పండగ సీజన్లో టాలీవుడ్ కు ఎంత నష్టం కలగచేయాలో అంతాచేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. సోమవారం హైకోర్టులో జరిగిన విచారణలో అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు విచారణనుఫిబ్రవరి పదో తేదీకి వాయిదా వేసింది. టికెట్ల ధరలను నిర్దేశిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో జగన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా కమిటీ వేసి ధరలను ఖరారుచేయాలని హైకోర్టు ఆదే్శించింది.
అయితే హైకోర్టు సూచనల మేరకు అధికారులతో పాటు టాలీవుడ్ ప్రతినిధులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ సమావేశం ఓ సారి జరిగింది. మరో వారంలో మరోసారి జరగనుంది . ప్రత్యేకంగా సమయం లేకపోయినా ఈ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా చర్చలు పూర్తి కాలేదు బట్టి అఫిడవిట్ దాఖలుకు ప్రభుత్వం సమయం తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
టిక్కెట్ల ధరలు అతి తక్కువగా ఉండటంతో పెద్ద సినిమాల నిర్మాతలు సినిమాల విడుదల చేయడాన్ని నిలిపివేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే టాలీవుడ్‌లోనూ కొత్తగా ఈ అంశంపై రచ్చ ప్రారంభమైంది. అందర్నీ కలుపుకుని వెళ్లి ప్రభుత్వంతో చర్చించాలంటూ మోహన్ బాబు సినీ పరిశ్రమకు బ హిరంగ లేఖ రాయడం కలకలం రేపుతోంది.