మంచి చెప్పినందుకు తనకు బాగా పరిచయం అయిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాను మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఓ ముస్లిం రౌడీషీటర్‌తో కొట్టించడాన్ని ఆర్యవైశ్య వర్గాలు మర్చిపోలేకపోతున్నాయి. ఆ వివాదాన్ని ముగించేందుకు అప్పటికప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనను పిలిపించి.. కేట్ కట్ చేయించి.. చాలా చెప్పించారు. వైసీపీ గురించి గొప్పగా చెప్పించారు. అప్పట్లో ఆ ఎపిసోడ్ ముగిసిపోయిందనుకున్నారు. కానీ సుబ్బారావు గుప్తా ఇప్పుడు రోడ్ల మీదకు వస్తున్నారు. తనపై జరిగినదాడి గురించి చెప్పేందుకు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
విజయవాడ ఎంబీవీకే ఆడిటోరియంలో ఆర్యవైశ్య ఐక్యత సభను నిర్వహిస్తున్నారు.రాజకీయ భౌతిక దాడులకు నిరసనగా తాను రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు గుప్తా ప్రకటంచారు. కనిగిరి నియోజకవర్గం నుంచి కార్యాచరణ ప్రారంభిస్తానని చెబుతున్నారు. తనపై దాడి చేసిన వారికి పోలీసులు అరెస్టు పేరిట రాచమర్యాదలు చేసి స్టేషన్ బెయిలు ఇచ్చారని ఆరోపించారు. తన ఇంటిపై దాడికి పాల్పడ్డవారిని ఇంతవరకు అరెస్టు చేయలేదని, దీనిపై తాను ఉద్యమించనున్నట్లు సుబ్బారావు గుప్తా చెబుతున్నారు.
గుప్తా ఒంటరిగా ఉద్యమించడం లేదు. ఆయన వెనుక ఆర్యవైశ్య సంఘాలు ఉన్నాయి. అత్యంత దారుణంగా దాడి చేసిన తర్వాత కూడా ఆత్మాభిమానం చంపుకుంటే మొదటికే మోసం వస్తుందని ఆర్యవైశ్య సంఘాలు చెప్పడంతో ఆయన ..తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పాలని డిసైడయ్యారు. ఇది వైసీపీకి ఇబ్బందికరమే. ఇప్పటికే ఆర్య వైశ్యులు ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వ్యాపారవర్గాలను వైసీపీ సర్కార్ నిండా ముంచేసిందన్న ఆగ్రహం ఓ వైపు ఉంటే… దాడులు మరో వైపు వారి ఆగ్రహాన్ని పెంచుతున్నాయి.