రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అంతా మా ఇష్టం అన్నట్లుగా జీవోలు జారీ చేయడం… కోర్టులో పిటిషన్లు పడే సరికి ఉపసంహరించుకోవడం ఏపీ సర్కార్కు కామన్ అయిపోయింది. తాజాగా మరో జీవోను ఉపసంహరించుకుంటున్నట్లుగా హైకోర్టుకు తెలిపి మరోసారి రివర్స్ సర్కార్ అనే విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధమయింది. గత మార్చిలో సర్పంచ్లు, గ్రామ కార్యదర్శుల అధికారాలకు కత్తెర వేసి వాటిని గ్రామ సచివాలయంలో పని చేసే వీఆర్వోలకు ఇస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ రెండును జారీ చేసింది.
ఇది రాజ్యాంగ విరుద్ధమని.. సర్పంచ్లకు రాజ్యాంగ బద్ధంగా వచ్చిన అధికారాలను ఎలా ఇతరులకు కేటాయిస్తారన్న విమర్శలు అప్పుడే వచ్చాయి. న్యాయనిపుణులు సైతం రాజ్యాంగ విరుద్ధమైన పాలన అని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్లింది. చివరికి హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఏ చట్టం ప్రకారం ఇలా సర్పంచ్ అధికారాలు.. వీఆర్వోలకు ఇచ్చారంటే సమాధానం చెప్పలేకపోయిన ప్రభుత్వం. సంక్షేమ పథకాలు బాగా అమలు చేయాలని ఇచ్చామని వాదిచింది. దీంతో రాష్ట్రానికి సీఎం ఎలా అధిపతో.. పంచాయతీలకు సర్పంచ్ కూడా అలాగేనని ధర్మాసనం స్పష్టం చేసి జీవోను సస్పెండ్ చేసింది.
ఇప్పుడు దాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక.. చివరికి ఉపసంహరించుకుంటామని కోర్టుకు తెలిపింది. ఇటీవలి కాలలో ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం వరుగా జరుగుతోంది. దాదాపుగా ప్రతి నిర్ణయం అంతే రివర్స్ అవుతోంది. ఇలా రివర్స్ అవడం వల్ల పరువు కాపాడుకుంటుందో… పరువుపోగొట్టుకుంటుందో అర్థం కాని పరిస్థితుల్లో వైసీపీ నేతలు పడ్డారు.