హైదరాబాద్: మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసుతో తనకు సంబంధం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. తనకు ఎలాంటి సమన్లూ అందలేదని ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రకటించారు. రుణం తీసుకున్నపుడు తాను సంతకం కూడా చేయలేదని అన్నారు. ఆ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న సుజనా గ్రూప్ సంస్థలో తాను డైరెక్టర్‌ను కూడా కానని చెప్పారు. సమన్లు జారీ చేయటం పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడికైనా సమన్లు ఇవ్వొచ్చని అన్నారు. రు.100 కోట్లకు రుణం తీసుకుని మోసం చేశారంటూ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ అనే అంతర్జాతీయ బ్యాంక్ పెట్టిన కేసులో హైదరాబాద్ 12వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ తనకు జారీ చేసిన సమన్లపై కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు. ఈ విషయంపై ప్రశ్న అడిగిన విలేకరిపై విసుక్కుంటూ ప్రెస్ మీట్ నుంచి లేచి వెళ్ళిపోయారు.
మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందిస్తూ, విభజన హామీలు అమలు కాకపోతే రాజ్యాంగాన్ని గౌరవించనట్లేనని చెప్పారు. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పామని పేర్కొన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్‌ను ఈ రైల్వే బడ్జెట్లోనే ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమరావతి ప్రాంతంలో భూకంప ప్రభావాలపై కమిటీ వేశామని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయాలో ఆ కమిటీ అధ్యయనం చేసి సూచనలు ఇస్తుందని మంత్రి చెప్పారు.