జగన్మోహన్ రెడ్డి తెలుగు దేశం పార్టీకి ఏ ముహూర్తాన్న సవాలు విసిరారో కానీ అది కాస్త బెడిసికొట్టి సీన్ రివర్స్ అయ్యింది. కడప, కర్నూలు, విజయనగరం జిల్లాల నుండి కనీసం 8-10 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి మారేందుకు సిద్దంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజానిజాలు ఎలాగా ఉన్నప్పటికీ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ తెదేపాలోకి చేరడం దాదాపు ఖరారయిపోయింది. ఒకపక్క పార్టీలో ఇంత కల్లోలం చెలరేగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు డిల్లీ వెళ్ళడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఈడి కేసులలో కోర్టుకు హాజరయ్యేందుకే డిల్లీ వెళ్ళారన్నా అర్ధం చేసుకోవచ్చును కానీ రాష్ట్రపతి, ప్రధాని, ఆర్ధికమంత్రి, హోం మంత్రిని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపులు వగైరా అడిగేందుకు వెళుతున్నారుట! రేపటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలుకాబోతున్నాయి కనుక ఆయన అందుకే వెళ్ళారు కాబోలని సర్ది చెప్పుకోకతప్పదు.
ఒకవైపు పార్టీలో నుండి ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు, వారితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలో లేకపోతే మిగిలినవారిని కాపాడుకొనే ప్రయత్నాలో చేయకుండా, హడావుడిగా డిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్రమంత్రులను కలవాలనుకోవడం అనుమానాలకు, ఊహాగానాలకు తావిస్తోంది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి కూడా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలతో కొంచెం సత్సంబంధాలు నిలుపుకొనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏడాదికి ఒకటి రెండు సార్లు ఏదో ఒక ఇటువంటి సాకుతో వారిని కలిసి వస్తూనే ఉన్నారు.
విచిత్రమేమిటంటే ఆయన కోరినప్పుడల్లా వారందరూ కూడా ఆయనకి అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. అంటే మోడీ ప్రభుత్వం కూడా ఆయన పట్ల సానుకూలంగానే స్పందిస్తోందన్న మాట. ఆయన తమ మిత్రపక్షమయిన తెదేపా ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడనే సంగతి తెలిసి ఉన్నప్పటికీ, అదేమీ తెలియనట్లు అపాయింట్ మెంట్లు ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు గురించి ఇచ్చే పిర్యాదులను కూడా స్వీకరించడాన్ని ఏమనుకోవాలి? కనుక వారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి చెపుతున్న కారణాలు కాకుండా వేరే ఇతర కారణాలుండే అవకాశం ఉంది.