కేసీఆర్ కుమారుడు కేటీఆర్.. జాతీయ స్థాయిలో ఫోకస్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నేషనల్ మీడియా ఏ అంశాలను “న్యూస్”గా భావిస్తుందో అలాంటివాటిపై కేటీఆర్ చురుకుగా స్పందిస్తున్నారు. పంజాబ్‌కు చెందిన చెస్ ప్లేయర్ మల్లికాహండాను ప్రత్యేకంగా తెలంగాణకు పిలిపించి రూ. పదిహేను లక్షల వరకూ ఆర్థిక సాయం చేశారు. తాను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా ఎంతో ప్రతిభ చూపి పతకాలు సాధిస్తే..ఆదుకుంటామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆమె అక్కడి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కేటీఆర్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు.
గత వారమే ట్విట్టర్లో మల్లికా హండాకు కేటీఆర్ మద్దతు ప్రకటించారు. తాను అండగా ఉంటానన్నారు. ఆ ప్రకారం… హైదరాబాద్‌కు పిలిపించి ఆర్థిక సాయం ఇచ్చారు. ఇది జాతీయ మీడియాలో హైలెట్ అయింది. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఆదరణకు నోచుకోని ఆటగాళ్లు కుప్పలు తెప్పలుగా ఉన్నారని.. రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే కేటీఆర్ ఆలోచనలు వేరని మరికొంత మంది వాదిస్తున్నారు.
కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీ అనే వివాదాస్పద స్టాండప్ కమెడియన్లను కేటీఆర్ మద్దతుగా నిలిచిన అంశం కూడా జాతీయ మీడియాలో హైలెట్ అయింది. ఇతర రాష్ట్రాల్లో వారి షోలను రద్దు చే్తున్నప్పుడు వారిద్దర్నీ హైదరాబాద్‌కు ఆహ్వానించారు. నిజానికి తెలంగాణతో ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారాలు అయినా కేటీఆర్..జాతీయ స్థాయిలో ఫోకస్ కావడానికే ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయ నేతలు ఏం చేసినా ఓ కారణం ఉంటుంది.. ఏ ప్రయోజనం లేకుండా పంజాబ్ ప్లేయర్‌ను పిలిచి రూ. పదిహేనులక్షలు ఇవ్వరుగా..?