రఘురామకృష్ణరాజు సంక్రాంతి పండుగను సొంత ఊరు భీమవంలో జరుపుకోవడానికి వెళ్తున్నారు. నర్సాపురం ఎంపీగా ఉండి ఆయన ఏపీలో అడుగు పెట్టడానికి నానా టెన్షన్లు పడుతున్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తారని ఆయన చాలా రోజులుగా చెబుతున్నారు. ఏపీలో అడుగు పెట్టకపోయినా హైదారాబాద్ నుంచే ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేసి తీసుకెళ్లి ధర్డ్ డిగ్రి ప్రయోగించారు. ఇక ఏపీకి ఏమీ వస్తారులే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన వ్యూహం మార్చారు. నర్సాపురంలో అడుగు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే ప్రభుత్వం ఏదో విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతుంది కాబట్టి కౌంటర్‌గా రఘురామ చాలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఆయన ప్రతి కదలికను రికార్డు చేసేలా కెమరామెన్లను పెట్టుకున్నారు. కొంత మంది సీక్రెట్ కెమెరామెన్లను కూడా పెట్టుకున్నారు. ఇక మాస్క్ పెట్టుకోకపోయినా ఆ కారణం చూపి అరెస్ట్ చేస్తారు కాబట్టి అసలు మాస్కే తీయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఎవరితోనూ మాట్లాడకూడదని డిసైడయ్యారు. ఎవరితో అయినా మాట్లాడితే… రెచ్చగొట్టారని చెప్పి కేసు పెట్టవచ్చని ఆయన అనుమానిస్తున్నారు.
తనకు వై కేటగిరి భద్రత ఉందని.. స్థానిక పోలీసులు తన భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఊరుకోనని అంటున్నారు. గతంలో నర్సాపురం వస్తే రఘురామపై దాడులకు… కేసులకు పక్కా ప్రణాళికలు సిద్ధంచేశారు. చాలా కేసులు పెట్టారు. ఆ కేసుల్లో ఆయనను అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం పెట్టదల్చుకుంటే కొత్త కేసులు పెట్టడం పెద్ద విషయమేం కాదు. అయినా రఘురామ రాజీనామా వ్యూహంతో ఉన్నారు. ప్రభుత్వం ఏ ఓవరాక్షన్ చేసినా తనకు రాజకీయంగా లాభమే అవుతుందన్న ఈక్వేషన్‌తో నర్సాపురం వస్తున్నట్లుగా భావిస్తున్నారు. మొత్తంగా రఘురామ.. భీమవరంకు వచ్చి సేఫ్‌గా ఢిల్లీ వెళ్తారా లేకపోతే.. బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగాలా అన్నది వేచి చూడాల్సిందే.