ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్లు జరగడం లేదు. నలభై శాతం సీట్లు మాత్రమే బుక్కయ్యాయి. ఇప్పటికే ప్రత్యేక సర్వీసులు ప్రారంభించారు. కానీ ఆదరణ ఉండటం లేదు. కానీ తెలంగాణ ఆర్టీసీ బస్సులు మాత్రం ఫుల్ లోడ్‌తో ఏపీ వైపు పరుగులు తీస్తున్నాయి. ఏపీ ఆర్టీసీ టిక్కెట్ రేట్లను యాభై శాతం పెంచడం.. తెలంగాణ ఆర్టీసీ పెంచకపోవడమే దీనికి కారణం. అయితే ఏపీ ఆర్టీసీకి అంతర్రాష్ట్ర సర్వీసులతోనే నష్టం వస్తోంది. ఈ అంతర్రాష్ట్ర సర్వీసులు అందుబాటులోఉండని.. ఏపీ అంతర్గత సర్వీసుల్లో మాత్రం … ఆప్షన్ లేక ప్రజలు ఏపీ ఆర్టీసీ ఎంత ఫీజు వసూలు చేస్తే అంత ఇచ్చి.. స్వస్థలాలకు పయనం అవుతున్నారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే ఆయా రాష్ట్రాల బస్సుల్లో జనం ఉంటున్నారు. కానీ ఏపీ బస్సుల్లో మాత్రం సగం కూడా నిండటం లేదు. అదే సమయంలో ఏపీలో విజయవాడ నుంచి విశాఖ సహా ఇతర నగరాలకు వెళ్లే బస్సులు మాత్రం హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఎంత చార్జీ అయినా తప్పదు కదా అని బయలుదేరుతున్నారు. ఎందుకంటే… అక్కడ సర్వీసులు నడపడానికి ఇతర రాష్ట్రాల బస్సులకు చాన్స్ ఉండదు.
ఇలా ప్రత్యామ్నాయం లేని చోట ప్రజల వద్ద నుంచి టిక్కెట్ల చార్జీలను గల్లా పట్టి మరీ వేస్తున్న ఆర్టీసీ ప్రత్యామ్నాయ సర్వీసులు ఉన్నచోట మాత్రం నష్టాలకే నడుపుతోంది. సినిమా టిక్కెట్ రేట్లను ఏ మాత్రం గిట్టుబాటు కాని విధంగా తగ్గించేసి.. ఆర్టీసీ విషయంలో మాత్రం… ప్రజల ఆదరణ కోల్పోతున్నామని తెలిసినా ధరలు ఎక్కువగా నిర్ణయించడంపై ప్రభుత్వంపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయింది.