నిన్నటిదాకా టీడీపీ నేతలు తమపై జరుగుతున్న వేధింపుల కోసం తాము పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది. వేధింపులకు గురవుతున్న వైసీపీ నేతల కోసమూ వారు పోరాడాల్సి వస్తోంది. సొంత పార్టీలో గళమెత్తుతున్న వారిని అణిచి వేయడానికి వైసీపీ పెద్దలు ఏ మాత్రం మొహమాట పడటం లేదు. వరుసగా ఆ పార్టీ నేతల్ని జైలుకు పంపుతున్నారు. లేకపోతే దాడులకు తెగబడుతున్నారు. ఒంగోలులో .. మంచి చెప్పి సుబ్బారావు గుప్తాపై దాడిచేశారు. దాంతో గుప్తాకు మద్దతుగా టీడీపీ నేతలు ఆందోళనలు చేశారు.
చిత్తూరు జిల్లాలో వైసీపీ జడ్పీటీసీ భర్త.. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేశారని.. అరెస్ట్ చేసి ముసుగేసి మీడియా ముందు పెట్టారు. ఆయనకు బెయిల్ రాకుండా ఒకటి తర్వాత ఒకటి కేసులు చూపిస్తూ జైల్లోనే ఉంచుతున్నారు. ఆయన కోసమూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా గుంటూరు జిల్లాలో వినుకొండలో రైతు నరేంద్ర కోసం టీడీపీ నేతలు రోడ్డెక్కుతున్నారు. ఆ రైతు వరికి మద్దతు ధర అడిగారు .కానీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చెప్పుతో కొడతానన్నారు. ఈ వివాదం పెరిగి పెద్దదయి..రైతుపై హత్యాయత్నం కేసు పెట్టేదాకా వెళ్లింది. ఆ రైతు కూడా వైసీపీ గ్రామ నాయకుడే. ఆయన కోసం కూడా టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఆందోళనలు చేస్తున్నారు.
తమపై వేధింపులు కామనే అనుకునే స్థితికి టీడీపీ నేతలు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ నేతలు.. తమ సొంత నేతల్నే వేధించుకుంటున్నారని.. ఇది పతకానికి పరాకాష్ట అని అంటున్నారు. అయితే వైసీపీ నేతలు సొంత నేతలపై కేసులు పెట్టుకుంటే టీడీపీ ఎందుకు వారికి మద్దతివ్వాలన్నది సామాన్యంగా అందరికీ వస్తున్న సందేహం. అయితే రాజకీయంగా పనికి వచ్చే వాటికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నామని.. గుప్తా అంశంలో సామాజికవర్గం… నరేంద్ర అంశంలో రైతులకు మద్దతుగా ఉన్నామని టీడీపీ నేతలంటున్నారు. ఏదైనా కానీ పొలిటికల్‌గా ఉపయోగపడటమే ముఖ్యమనే భావనలో ఉన్నారు.