నిన్నటికి నిన్న వైఎస్ఆర్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలపై చర్చ కొనసాగుతూ ఉండగానే, వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పుష్ప నిర్మాతలు కావాలనే రెడ్లను విలన్లుగా చూపిస్తున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు మరొక చర్చకు దారితీశాయి. అయితే బండ్ల గణేష్ సినీ ఇండస్ట్రీ తరఫున వైకాపా నేతలకు బలమైన కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
వైఎస్ఆర్ సీపీ నేత రవిచంద్రారెడ్డి టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ పుష్ప సినిమాలో ముగ్గురు అన్నదమ్ములను విలన్లుగా చూపించారని, వీరి పేర్లు కొండారెడ్డి, జక్కా రెడ్డి, జాలి రెడ్డి అని, కావాలనే విలన్లకు ఇలా రెడ్డి పేర్లను పెట్టారని మండిపడ్డారు వైసిపి అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి. ఈ సినిమా నిర్మాతలు చంద్రబాబు నాయుడు కి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని, హీరో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు అని, చంద్రబాబునాయుడు భావజాలాన్ని కావాలనే ఈ నిర్మాతలు ప్రజల పై రుద్దుతూ ఉన్నారు అని, ఉద్దేశపూర్వకంగానే విలన్లకు రెడ్డి పేర్లు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు .
అయితే సినీ పరిశ్రమ తరపున బండ్లగణేష్ వైకాపా అధికార ప్రతినిధి కి బలమైన కౌంటర్ ఇచ్చారు. గతంలో బాలకృష్ణ సమరసింహా రెడ్డి అన్న సినిమా తీశారని అందులో నటించిన హీరో బాలకృష్ణ మరియు దర్శకుడు బి.గోపాల్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేరు పెట్టి హీరోయిజం ఎలివేట్ చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా చిరంజీవి ఇంద్ర సినిమాలో ఇంద్రసేనారెడ్డి పాత్ర పోషించారని నిర్మాత అశ్వినీదత్ కమ్మ సామాజిక వర్గం చిరంజీవి కాపు సామాజిక వర్గం అయినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేరు పెట్టారని గుర్తు చేశారు అంతేకాకుండా సైరా నరసింహారెడ్డి పేరుతో చిరంజీవి సినిమా తీసినప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలకు ఇవన్నీ గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు బండ్ల గణేష్.
మొత్తానికి పాత్రల పేర్లు కథానుగుణంగా ఉంటాయో కానీ, ఇలా భావజాలానికి అనుగుణంగా ఉండవని బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు వైకాపా అధికార ప్రతినిధి కి బలమైన కౌంటర్ లాగానే కనిపిస్తున్నాయి అంటున్నారు నెటిజన్లు.