ఆంధ్రప్రదేశ్ నైట్ కర్ఫ్యూ అమలును వాయిదా వేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. పండుగల కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగవద్దని వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి .. ప్రజలను వైరస్ బారి నుంచి కాపాడటానికి కర్ఫ్యూ విధించారని అనుకున్నారు. కానీ ప్రజలకు ఇబ్బంది కారణం చెప్పి ఇప్పుడు కర్ఫ్యూ అమలును పద్దెనిమిదో తేదీకి వాయిదా వేయడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.
ప్రభుత్వ నిర్ణయం సంక్రాంతి సినిమాలకు ముఖ్యంగా నాగార్జున సినిమా బంగార్రాజుకు రిలీఫ్ ఇవ్వనుంది. నైట్ కర్ఫ్యూ కారణంగా… ఆంక్షలు విధించిన కారణంగా ఆ సినిమాకలెక్షన్లు దారుణంగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళనచెందారు. అయితే కొన్ని గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడంతో వాళ్లంతా రిలీఫ్ ఫీలయ్యారు. ఒక్క నైట్ కర్ఫ్యూనే కాదు ఆంక్షలు మొత్తం పద్దెనిమిదో తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ కారణంగా దాదాపుగా వారం రోజుల పండుగ సెలవులను బంగార్రాజు ఏపీలో క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. నిజానికి ఏపీలో మరీ ప్రమాదకర స్థాయిలో కరోనా వ్యాప్తి చెందడం లేదు. అయినప్పటికీ.. నైట్ కర్ప్యూ విధించడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇబ్బంది అయితే సినిమాలు వాయిదా వేసుకోవాలని పేర్ని నాని సలహా కూడా ఇచ్చారు. ఈ క్రమంలో సంక్రాంతి సినిమాలురిలీఫ్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడంతో … ఆయా సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నట్లయింది.