“తెలంగాణా ప్రజలు మా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకొని మాకే ఓట్లు వేస్తున్నారు. ప్రజలందరూ మా వెంటే ఉన్నారని చెప్పుకోవడానికి మా విజయాలే ఉదాహరణలు. మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కనీయడం లేదు.” ఇవీ ప్రతీ ఎన్నికలకు ముందు, విజయం సాదించిన తరువాత తెరాస నేతలు తప్పకుండా చెప్పుకొనే మాటలు. కానీ తెరాస విజయ రహస్యం ఏమిటో ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకవేళ తెలియని వారెవరయినా ఉంటే వారికి కూడా తెలియడానికి అన్నట్లుగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో విజయం సాధించడం కోసం తనదైన శైలిలో మళ్ళీ పావులు కదపడం మొదలుపెట్టింది.
వరంగల్ కాంగ్రెస్ సీనియర్ నేత బస్వరాజు సారయ్యను తెరాసలోకి రప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అధికార పార్టీ నుండి ఆఫర్ వస్తే కాదనేవారెవరుంటారు..కనుక దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తాజా సమాచారం. సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రత్యర్ధి పార్టీకి చెందిన బలమయిన నేతను బయటకి లాగేస్తే ఇక ఆ పార్టీ పని అయిపోయినట్లే కనుక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్లే.
ఇక మిగిలింది తెదేపా, బీజేపీలు. అవెప్పుడో దాదాపు ఖాళీ అయిపోయాయి. పైగా వరుసపెట్టి ప్రతీ ఎన్నికలలో డిపాజిట్లు కూడా కోల్పోతుండటంతో వాటి ఆత్మవిశ్వాసం కోల్పోయున్నాయి. కనుక వాటి గురించి తెరాస పట్టించుకోనవసరం లేదు. అయినా ఇంకా వరంగల్లో ఆ రెండు పార్టీలలో కాస్త గట్టి నేతలు ఎవరయినా మిగిలి ఉన్నట్లయితే వారికీ ఆఫర్ ఉంటుంది. ఇదే తెరాస విజయరహస్యం అని చెప్పవచ్చును.