దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస ట్వీట్ల తో చెలరేగి పోయారు.మంత్రి పేర్ని నాని తో భేటీ అనంతరం చర్చల పై సంతృప్తి వ్యక్తం చేసిన వర్మ ఒక రోజులోనే ప్లేటు ఫిరాయించి సినీ టికెట్ల విషయం లో ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ట్వీట్లు చేయడం చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే
మహారాష్ట్రలో ఆర్ ఆర్ ఆర్ సినిమా టికెట్ ధర రెండు వేల రెండు వందల రూపాయల వరకు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 200 రూపాయలు కూడా లేకపోవడాన్ని వర్మ తప్పుపట్టారు. ప్రైవేటు వ్యక్తులు తయారు చేసే ఉత్పత్తికి ప్రభుత్వం ధరల నియంత్రణ చేయడం తప్పు అని వాదించిన వర్మ, 500 కోట్ల రాజమౌళి సినిమా ను కోటి రూపాయల ఖర్చుతో తీసిన చిన్న సినిమాను ఒకే టికెట్ రేట్ కి అమ్మాలి అని ప్రభుత్వం ఒత్తిడి చేయడం తప్పని వాదించారు వర్మ. ఏ ఉత్పత్తి ని అయినా ఇలా తక్కువ ధరకు అమ్మాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఆ ఉత్పత్తి కను మరుగు అవుతుందని వాదించారు వర్మ.
మిగతా రాష్ట్రాలు అన్నీ ఒక ధరలో టికెట్ల ను అమ్ముతుంటే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మరొక రకమైన ధరలు ఉండడం ఆర్టికల్ 14 ని ఉల్లంఘించడమే అని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు వర్మ. కరోనా కి ముందు 24 గంటలు థియేటర్లు తెరిచి ఉంచేలా మహా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్న అర్థం పర్థం లేని నియంత్రణ లను తప్పుపట్టారు. బెనిఫిట్ షో ల ద్వారా ఎక్కువ టికెట్ ధర ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఇష్టపూర్వకంగా ఆ ధర చెల్లిస్తున్నారని, దీని వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం ఏముందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు రాంగోపాల్ వర్మ.
ఇక పవన్ కళ్యాణ్ లాంటి వారు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోవడం పట్ల కూడా తనదైన శైలిలో స్పందించారు రాంగోపాల్ వర్మ. ఐ ఫోన్ ని పగలగొట్టి అందులో ఉన్న ముడి పదార్థాలు ధర లెక్కేస్తే వేయి రూపాయలు కూడా ఉండదని కానీ దాన్ని రెండు లక్షల రూపాయలకు అమ్ముతున్నారు అంటే దానికి కారణం బ్రాండ్ వాల్యూ మరియు అలా రూపొందించాలనే మేధస్సు అని, బ్రాండ్ వాల్యూ కారణంగానే మార్కెట్లో డిమాండ్ ఉంటుందని ప్రభుత్వానికి గుర్తుచేశారు రామ్ గోపాల్ వర్మ.
అసలు 1955 సంవత్సరం నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని 70 ఏళ్ల తర్వాత తెర మీదకు తీసుకుని వచ్చి ఉన్నపళంగా దానిని మార్చాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం వచ్చిందని ప్రశ్నించారు రాంగోపాల్ వర్మ. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల చూపుతున్న వివక్షను జాతీయ స్థాయిలో హైలైట్ చేయడానికి ముంబైలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని తన మీద ఒత్తిడి వస్తోందని రాం గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. అదే విధంగా సినిమా ప్రదర్శన అన్నది ఆర్టికల్ 19 కిందకు వస్తుందని, రాజ్యాంగం కల్పించిన ఈ భావవ్యక్తీకరణ హక్కు ని కాలరాసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రామ్ గోపాల్ వర్మ వాదించారు.
నిజంగా ప్రభుత్వాని కి సినీ పరిశ్రమ పై చిత్త శుద్ధి ఉంటే తక్కువ ధర లో ప్రజలకు సినిమా అందించాలనే ఉద్దేశం ఉంటే దానికి పలు రకాల మార్గాలు ఉన్నాయని చెబుతూ ఆ మార్గాలను కూడా రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వానికి వివరించారు. చైనా అమెరికా దేశాలతో పోలిస్తే భారత దేశంలో తగినన్ని థియేటర్లు లేవని, థియేటర్ల సంఖ్య పెరిగేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని, తక్కువ ధరలో ప్రేక్షకులకు సినిమా అందించడానికి కొత్త టెక్నాలజీల ద్వారా పలు రకాల మార్గాలు ఉన్నాయని రామ్ గోపాల్ వర్మ సూచించారు.
మొత్తం మీద, సినీ పరిశ్రమ కి సంబంధించిన టికెట్ల రేట్లు, షో సమయాలు వంటి వాటి పై కాకుండా ప్రజల భద్రత , పన్నుల వసూలు వంటి అంశాల పై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని ముగించాడు రాంగోపాల్ వర్మ.