తెలుగుదేశం పార్టీ .. జనసేనతో పొత్తుకు ఆసక్తి చూపిస్తూండటం.. ఇటీవల కుప్పంలో వన్ సైడ్ లవ్ పేరుతో వ్యాఖ్యలు చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని ఆయన రూల్ అవుట్ చేయలేదు. పొత్తులపై ఒక్కడినే నిర్ణయం తీసుకోనని అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామని గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో జనసేన పుంజుకుంటోందని అందుకే పలు పార్టీలు జనసేనతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. పొత్తుల కంటే ముందు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడతామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పొత్తులపై ఆమోదయోగ్యంగా ఉంటే అప్పుడు అలోచిస్తామని..ఈ అంశంపై అందరిదీ ఒకే మాటగా ఉండాలని శ్రేణులకు పవన్ కల్యాణఅ సూచించారు. బీజేపీతో పొత్తులో ఉంటే ఇతర పార్టీలతో పొత్తు అనే ప్రశ్నే రాకూడదు. కానీ పవన్ కల్యాణ్ ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో ఓపెన్ చాయిస్ ప్రకటించారు. అంటే పవన్ కల్యాణ్ కూడా.. ఉపయోగకరమైన పొత్తుల విషయంలో ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నట్లుగానే భావిస్తున్నారు.
ఇప్పటికే పవన్ ఓ ఎన్నికలో పోటీ చేయలేదు. మరో ఎన్నికల్లో పోటీ చేసి..తాను స్వయంగా ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కనీసం ప్రభావాన్ని చూపించాల్సి ఉంటుంది. కానీ బీజేపీతో పొత్తులో ఉంటే అది సాధ్యం కాదు. ఆ పార్టీకి ఒక్క శాతం ఓటు బ్యాంక్ ఉంది. ఆ పార్టీ జనసేనపై ఆధారడటం తప్ప.. జనసేనకు ఉపయోగం లేదు. టీడీపీతో కలిస్తేనే ఉభయతారకంగా ఉంటుందని ఇటీవల స్థానిక ఎన్నికలు కూడా తేల్చాయి. దీంతో పవన్ కూడా టీడీపీ వైపు మొగ్గుతున్నట్లుగానే అంచనా వేయవచ్చు.