సీఎం జగన్ కరోనా పరిస్థితులపై సమీక్ష పెడితే ప్రజలకు ప్రపంచ స్థాయి కరోనా వైద్య అందిస్తున్నామని చెబుతూంటారు. కానీ ఏపీ ప్రభుత్వం ఏ మంత్రికైనా.. అధికారికైనా కరోనా సోకితే మొదట హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి పరుగులు పెట్టేవారు. ఇప్పుడు కాస్త మారారు. అపోలోకి వెళ్లడంలేదు. అలాగని ఏపీలోనే ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. ఏఐజీ ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు. తాజాగా మంత్రి కొడాలి నానికి కూడా కరోనా సోకింది. ఆయనకు లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు.
కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో నేరుగా వెళ్లి ఏఐజీ ఆస్పత్రిలో చేరిపోయారు. కరోనా చికిత్సలో ఇటీవలి కాలంలో ఏఐజీ ఆస్పత్రి వీఐపీలకు కేరాఫ్ గా మారింది. అక్కడ కాక్టెయిల్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. అత్యంత ఖరీదు అయినప్పటికీ అక్కడే చేరిపోతున్నారు. గవర్నర్ కూడా రెండు విడుతలుగా అక్కడే చికిత్స పొందారు. ఇప్పుడు కొడాలి నాని కూడా అక్కడేచేరిపోతున్నారు. ఇక ప్రజాధనం ఇలా మంత్రులు.. ఎమ్మెల్యేల కరోనా ఖర్చు కోసం.. అపోలో ఖాతా నుండి ఏఐజీకి మార్చే అవకాశాలు ఉన్నాయి.
పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలు కల్పించినప్పుడు ఏపీ ప్రజాప్రతినిధులు .. ఉన్నతాధికారులు కరోనా చికిత్సకోసం కార్పొరేట్ ఆస్పత్రులకు ఎందుకు వెళ్లాలన్న ప్రశ్న మొదటి వేవ్ నుండి వస్తోంది. ఏపీలోనే చికిత్స తీసుకోవాలని ప్రజలకు ధైర్యం ఇవ్వాలన్న సూచనలూ వస్తున్నాయి.కానీ ఎవరూ పట్టించుకోలేదు. హైదరాబాద్కు పయనమవుతూనే ఉన్నారు.