ఫెడరల్ ఫ్రంట్ అసాధ్యమని రాజకీయ విశ్లేషకులుఅందరూ చెబుతున్నా… పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్న పద్దతిలో కేసీఆర్ ముందుకెళ్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఉండి తీరాలన్న లక్ష్యంతో ఆయన ప్రగతి భవన్ నుంచే ప్లాన్లు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే స్టాలిన్, విజయన్, ఏచూరి, లాలూ తనయుడు తేజస్విలతో చర్చలు జరిపిన ఆయన త్వరలో శరద్‌పవార్‌తోనూ కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్న స్ఫూర్తితో జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తెచ్చిన కేసీఆర్ కు పరిస్థితులు కలిసి రాలేదు. ప్రత్యేక విమానాలేసుకుని అందర్నీ కలిసి వచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు మరోమారు అలాంటి ప్రయత్నాలు ప్రారంభించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒక్కటి చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంపైనే కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు.
కేసీఆర్ .. తన ఫెడరల్ ప్రయత్నాలన్నీ బీజేపీ కోసమేనని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా పార్టీలను దూరం జరిపి.. విపక్ష ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇతరులు విమర్శిస్తున్నారు. ఈ విషయంలో స్టాలిన్ తాము కాంగ్రెస్‌తోనే ఉంటామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే పరిస్థితుల్లో మార్పు వస్తుందని.. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవుతాయని కేసీఆర్ నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే భేటీలు కొనసాగిస్తున్నారు.