జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ నాయకుడు రామసుబ్బారెడ్డి… వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాకను ఎంతగా వ్యతిరేకించినప్పటికీ చివరినిమిషంలో ఎందుకు వెనక్కు తగ్గారు. అభ్యంతరాలు ఉన్నప్పటికీ, పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. అనే మాట ఎలా అనగలిగారు. ఫ్యాక్షన్లు విచ్చలవిడిగా నెలకొని ఉన్న సీమనుంచి.. అంత సింపుల్గా ఈ సమస్య ఎలా పరిష్కారం అయిపోయింది.. అంటే.. అక్కడే చంద్రబాబు అసలు చాణక్యం బయటపడుతోంది.
రామసుబ్బారెడ్డిని బుజ్జగించడానికి చంద్రబాబునాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్లుగా పుకార్లు వస్తున్నాయి. మరి కొన్ని నెలల్లోనే ఆయనను చట్టసభకు తీసుకు వస్తానని, జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి దేవగుడి కుటుంబం చేరేందుకు సహకరించాలని చంద్రబాబు నచ్చజెప్పి ఒప్పించారు.
రామసుబ్బారెడ్డి తొలుత అసంతృప్తితో పార్టీనే వీడిపోవచ్చునని అంతా అనుకున్నారు. అయితే ఆయన చంద్రబాబు మాట విని పార్టీలోనే ఉండడానికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పుకుంటున్నారు. ఒకటి చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడం. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీకాలం త్వరలో ముగుస్తుంది. అప్పుడు ఆ జిల్లానుంచి జరిగే స్థానిక సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్ రామసుబ్బారెడ్డికి ఇచ్చేలా ఒప్పందం. దీనికి సహకరించడానికి దేవగుడి బ్రదర్స్ ఒప్పుకున్నారు. ఆమేరకు ఎమ్మెల్సీ చేయబోతున్నారు గనుక.. రామసుబ్బారెడ్డి కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది.
అలాగే.. కొందరు మరో కారణం కూడా చెబుతున్నారు. రామసుబ్బారెడ్డి మీద ఇంకా కొన్ని క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో అధికార పార్టీని వీడిపోతే ఇబ్బందులు తప్పవనే భయం కూడా ఆయనను నిలువరించినట్లు తెలుస్తున్నది. మొత్తానికి ఎంతో క్లిష్టమైన జమ్మలమడుగు సయోధ్యను చంద్రబాబు.. ఒక కొలిక్కి తీసుకువచ్చినట్లు తెలుస్తున్నది.