మెజారిటీ వున్న రాజ్యసభలోనే సభాకార్యక్రమాలను స్తంభింపజేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ 23న మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో లోక్ సభను స్తంభింపజేసే దిశగా వ్యూహాలు రూపొందించుకుంటున్నది.ఇందుకోసం తృణమూల్ కాంగ్రెస్, బెజెడి పార్టీల సహకారాన్ని తీసుకునే సన్నాహాలు జరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కి లోక్ సభలో వున్న 34 మంది ఎంపిల బలం కాంగ్రెస్ ఎత్తుగడలకు వత్తాసై నిలుస్తుంది.
సభాకలాపాల నిలుపుదలను రాజ్యసభ నుంచి లోక్ సభకు కూడా విస్తరింపజేయడంలో కాంగ్రెస్ తో సహా అన్నిపార్టీలకూ గొంతుకకు అడ్డుపడేవి అసహనం, మతతత్వాలే! ఈ అంశాల్లో మరీ లోతుకి వెళ్తే సంఖ్యాపరంగా మెజారిటీ మతస్తులైన హిందువుల మనోభావాలు దెబ్బతిని, అది ఈ ఏడాది జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి ఉపయోగపడగలదన్న అభిప్రాయం కాంగ్రెస్ లో గట్టిగా వుంది.
అయితే బడుగు బలహీనవర్గాల వారైన రోహిత్ ఆత్మహత్య, దేశద్రోహం కేసులో కన్హయ్య తదితరుల అరెస్టులపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా లోక్ సభలో ప్రశ్నించే సూచనలు వున్నాయి. ఈ చర్చ మతపరమైన అంశంగా మారి, బిజెపికి సానుకూలం కాకుండా కాంగ్రెస్ నాయకులు ఎలా కంట్రోల్ చేస్తారన్నది ఆసక్తిదాయకం.
జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ లో దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చారనే ఆరోపణపై ‘దేశద్రోహ’ నేరారోపణతో విద్యార్ధి సంఘ అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన సంఘటనపై రాహుల్ గాంధీ లెఫ్ట్ పార్టీలతో భుజం భుజం కలిపి ఉద్యమబాట పడుతున్నారు. కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు ఏర్పాటు చేసుకోవాలని తమ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరుతూ పశ్చిమ బెంగాల్ సిపియం కమిటీ ఇప్పటికే తీర్మానం చేసింది. ఈ విధంగా కాంగ్రెస్ – సిపిఎం, సిపిఐ పార్టీల మధ్య కలసి పనిచేసే ధోరణులు మళ్ళీ బలపడుతున్నాయి.
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ కుమార్తె అనర్ పటేల్ యాజమాన్యంలో వున్న రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఆ రాష్ట్రప్రభుత్వం భూములను తక్కువ ధరలకు కేటాయించడం, వ్యాపం కుంభకోణం, లలిత్ మోడీ అవినీతి మొదలైన అంశాలను లేవనెత్తడంద్వారా లోక్ సభను అడ్డుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.