అయోధ్యలో రాముడు హీరో అయితే కావొచ్చు గాక.. కానీ లంకలో వెళ్లి అడిగితే విలన్ అనే చెబుతారు! ఒక వూరి హీరో… మరో ఊరికి విలన్ కావడం పాత విషయమే. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇక్కడ రాష్ట్రంలో కొంత పాజిటివ్ ఇమేజి ఉండగా.. ఆయనను విలన్గా అభివర్ణిస్తూ.. ఆయనను తిట్టిపోయడం ద్వారా కూడా కాసిని ఓట్లు రాబట్టుకోవచ్చుననే ఆలోచన అక్కడ జరుగుతూ ఉండడమే విశేషం. అవేమీ వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గాలు కాదు. కాకపోతే, ఈ ప్రయత్నం జరుగుతున్నది తమిళనాడులో!
అయినా తమిళనాడు ప్రజల్లో బాబు విలన్గా ఎందుకు ముద్రపడ్డాడబ్బా? అనే సందేహం మీకు రావొచ్చు. అలాంటి ముద్ర ఉన్నదో లేదో గానీ.. అలాంటి వైషమ్యాలను రెచ్చగొట్టడానికి మాత్రం అక్కడి నాయకులు కొందరు తమ వంతు కృషి కసరత్తు చేస్తూ ఉన్నారు. అవును మరి… ఇక్కడ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికి స్మగ్లింగ్ చేయడానికి తెగబడి, పోలీసు ఎన్కౌంటర్లో మరణించిన తమిళ కూలీల సమస్యను ఆ రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు రాద్ధాంతం చేసి ఓట్లు పిండుకోవాలని చూస్తున్నాయి. అక్కడికేదో తాము కూలీల పక్షం అనే బిల్డప్ ఇవ్వడానికి చంద్రబాబును విలన్గా చిత్రీకరిస్తున్నాయి.
తమిళనాడులో ప్రజాసంక్షేమ కూటమి అధికారంలోకి వస్తే గనుక.. తమిళ కూలీలను చంపినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును హత్యకేసులో జైలుకు పంపిస్తా అంటూ ఎండీఎంకే నేత వైగోపాలస్వామి ప్రకటిస్తున్నారు. ఆరాష్ట్రంలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు మొదలైపోయాయి. అందుకే ప్రజల్లో ఆవేశ కావేశాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకునే కుట్రలు కూడా మొదలైపోయాయి. కాకపోతే.. తమిళనాడు రాష్ట్రంలోని నాయకుల ఓట్ల యావకు కూడా చంద్రబాబునాయుడే తిట్లు భరించాల్సి వస్తున్నది మరి!