సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ .. న్యాయపరమైన అంశాల్లో మ్యాన్ పవర్ కొరత తీర్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. గతంలో తెలంగాణ హైకోర్టుకు న్యాయాధికారుల కోటా నుంచి ఏడుగుర్ని న్యాయమూర్తులుగా నియమించేలా సిఫార్సు చేసిన ఆయన నేతృత్వంలోని కొలీజియం ఈ సారి ఏపీ హైకోర్టుకు లాయర్ల కోటా నుంచి ఏడుగురు న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేసింది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 29వ తేదీన సమావేశం అయింది. ఇందులో ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తుల నియామకంపై సిఫార్సులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాతలు రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
వీరంతా ప్రముఖ లాయర్లుగా.. న్యాయకోవిదులుగా గుర్తింపు పొందారు. గతేడాది నవంబర్లో ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను నియమించారు. న్యాయవాది కె.మన్మథరావు, న్యాయాధికారి బీఎస్ భానుమతిలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయమూర్తుల కొరత తీర్చేందుకు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కొలీజియం ప్రయత్నిస్తోంది.