టీచర్లు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ తమ పిల్లల్ని మాత్రం ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. లక్షలు జీతాలు తీసుకుని వారెవరూ చదువు చెప్పడం లేదన్నారు. బాగా చదువు చెబితే తమ పిల్లల్ని కూడా ఎందుకు ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించరని ప్రశ్నించారు. నారాయణ స్వామి వ్యాఖ్యలు చాలా కాలంగా చర్చల్లో ఉన్నవే. టీచర్లు ఎందుకు తమ దగ్గర పిల్లల్ని చదివించరని.. ప్రైవేటు స్కూళ్లలో చేరుస్తారనే డౌట్ చాలా మందికి ఉంది.
ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించేలా నియమం పెట్టాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే ఇప్పుడు నారాయణస్వామికి ఆగ్రహం రావడానికి కారణం.. సమాజంపై ఆయనకు ఉన్న బాధ్యత కాదు.. కేవలం ఉద్యోగులపై కోపం. ముఖ్యంగా టీచర్లపై. టీచర్లు పీఆర్సీ వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా సీఎం జగన్ పై పాటలు పాడుతున్నారు. సినిమా పాటలకు పేరడీలు కడుతున్నారు. ప్రభుత్వ నిర్వాకాలపై పిట్టకథలు చెబుతున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో ప్రభుత్వ పెద్దలకు కోపం వస్తోంది. మంత్రుల్ని తెరపైకి పంపి వరుస హెచ్చరికలు జారీ చేస్తోంది. మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన బొత్స కూడా మాట తూలిన.. ప్రభుత్వంపై దుర్భాషలాడిన ఉద్యోగులు పర్యవసానాలు అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. తర్వాత నారాయణ స్వామి రంగంలోకి వచ్చారు. ఉద్యోగులపై ప్రభుత్వం హెచ్చరికలకు దిగుతోందని దీన్ని బట్టి అర్థమవుతోందని ఉద్యోగ నేతలు అంటున్నారు.