టైమ్ మిషన్ కాన్సెప్ట్ భలే బాగుంటుంది. కాలాన్ని వెనక్కి తిప్పడం ముందుకు వెళ్లడం… గతాన్ని, భవిష్యత్తునీ, వర్తమానంలోనే బేరీజు వేసుకోవడం థ్రిల్లింగ్ కాన్సెప్ట్. ఇలాంటి కథలకు `ఆదిత్య 369` ఓ గీటు రాయి. సూర్య `24` కూడా టైమ్ మిషన్ లాంటి కథే. ఇప్పుడు ఈ జోనర్లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.
ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన `ప్రాజెక్ట్ కె` టైమ్ మిషన్ నేపథ్యంలో సాగే కథే అని తెలుస్తోంది. ఇదో సైన్స్ ఫిక్షన్ అని చిత్రబృందం ముందే చెప్పేసింది. గతంలోకి – భవిష్యత్తులోకీ వెళ్లగలిగే కనికట్టు.. ఈ సినిమాలో ఉందని సమాచారం. నాగచైతన్య దగ్గరకు ఇలాంటి కథే వచ్చింది. చైతూ త్వరలో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. అది సైన్స్ ఫిక్షన్ అని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.
ఇప్పుడు రామ్ చరణ్ కూడా టైమ్ మిషన్ నేపథ్యంలో కథనే ఎంచుకున్నాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు చరణ్. ఆ తరవాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సివుంది. అది టైమ్ మిషన్ కథే అని తెలుస్తోంది. మరోవైపు శర్వానంద్ `ఒకే ఒక జీవితం` కూడా ఇలానే టైమ్ మిషన్ చుట్టూనే తిరుగుతుందట. నిజానికి బాలయ్య కూడా ఈ జోనర్లో ఓ కథ చేయాలనుకున్నాడు. ఆదిత్య 369కి సీక్వెల్ గా, ఆదిత్య 999 సెట్స్‌పైకి తీసుకెళ్దామనుకున్నాడు. మరి… అదెప్పుడు మొదలవుతుందో చూడాలి.