పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు బీజేపీకి ఎలా కావాలంటే అలా సహకరించడానికి రెడీ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. పెగాసస్ స్పైవేర్‌పై చర్చకు పట్టుబట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తూంటే అసలు అది ప్రజలకు సంబంధం లేని అంశం.. చర్చ అవసరం లేదని విజయసాయిరెడ్డి ప్రకటించేశారు. మరో వైపు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌ను స్తంభింపచేయడానికి కూడా వెనుకాడబోమని టీఆర్ఎస్ చెబుతూంటే… పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించవద్దని కఠిన చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి బీజేపీకి అండగా నిలిచారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్.. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునే యోచనలో ఉంది. బడ్జెట్లో తెలంగాణకు దక్కేది ఏమీ ఉండదని ముందుగానే టీఆర్ఎస్ డిసైడైపోయింది. అందుకే దేశం మొత్తం తిరిగి చూసేలా ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. అందుకు రెడీ అయిపోయింది. అయితే గతలో పెగాసస్ అంశం తెరపైకి వచ్చినప్పుడు పార్లమెంట్ సమావేశాలను విపక్షాలు జరగనీయలేదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. అందుకే విజయసాయిరెడ్డి తాము విపక్షాల వైపు లేమని.. బీజేపీ వైపే ఉన్నామని చెప్పేందుకు ఏ మాత్రం సంకోచం లేకుండా పార్లమెం్ సమావేశాలను నిలిపివేసేవారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
ఏపీ ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో చేస్తున్నదేమీ లేదు. ఏ ఒక్క అంశంపైనా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నది లేదు. ఎంత అణిగిమణిగి ఉంటున్నా..కేంద్రం ఏపీకి పైసా సాయం చేయడం లేదు. ఇవ్వాల్సిన నిధులూ ఇవ్వడం లేదు. కానీ వైసీపీ నేతలకు మాత్రం కేసులు.. ఇతర విషయాల్లో రిలీఫ్ లభిస్తోంది. అది చాలని అనుకుంటూ.. బీజేపీకి అనుబంధ సంఘం అన్నట్లుగా వ్యవహరించడానికి సిద్ధమవుతోందన్న విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి.