కేంద్ర బడ్జెట్ అంటే ఎంతో ఊహించుకుంటారు. దేశ ఆర్థిక వేత్తలంతా ఎన్నో చర్చలు జరుపుతారు. అన్ని రంగాలు తమ తమ ప్రాధాన్యాలు.. కోరికలు.. ఆకాంక్షలు వెలిబుచ్చుతాయి. చివరికి ప్రభుత్వం ఏదో ఓ మెరుపు లేకపోతే మరకతో బడ్జెట్‌కు తుది రూపు ఇస్తుంది. కానీ ఈ సారి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఎవరికీ ఎలాంటి మెరుపులూ కనిపించలేదు. ఏదోఆశించి నిరాశపడటం తప్ప పెద్దగా మరకలు కూడా లేవు. ఎలాంటి ప్రత్యేకతలు ..విశేషాలు లేకుండా ఎప్పుడూ చెప్పే గతి శక్తి లాంటి మాటలు… మౌలిక సదుపాయాల రంగంలో చేపట్టే పనుల వివరాలతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసింది.
బడ్జెట్ మీద ఎక్కువ మంది ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం .. పన్ను మినహాయిపులు. వ్యక్తిగత , ఆదాయపు పన్ను మినహాయింపులు. ఏడేళ్ల కిందట యూపీఏ హయాంలో రెండున్నర లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉండేది. ఈ ఏడేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం ఎంతో పెరిగింది. అయినప్పటికి పన్ను మినహాయింపు ఆ స్థాయి నుంచి పెంచడానికి కేంద్రం అంగీకరించడం లేదు. ఈ సారి కూడా ఒక్క రూపాయి కూడా అదనపు పన్ను మినహాయింపు ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలోగే పాత, కొత్త పన్ను విధానాలను ఎంచుకుని .. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పన్నుల్లో మినహాయింపు లభిస్తే సరి.. లేకపోతే.. పన్నులు కట్టుకోవాల్సిందే.
మరో వైపు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నెలకు రూ. లక్షా నలభై వేల కోట్లకు చేరాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే.. పరోక్ష పన్నుల రూపంలో ప్రజలందరి వద్ద వసూలు చేస్తున్న మొత్తం అది. అందులో పెట్రోల్, డీజిల్ మద్యం తో పాటు స్థానకి ప్రభుత్వాలు వసూలు చేసేవి ఉండవు. ఇంతగా ఆదాయం కళ్ల జూస్తున్నా ప్రజలకుకాస్తంత రిలీఫ్ ఇవ్వడానికి మనసొప్పలేదు. ఇక గొప్పగా దేశంలో మార్పులు తెచ్చే సంస్కరణలు ఏమైనా చేపట్టారా అంటే.. గొప్పగా ఏదీచెప్పుకోలేదు. కొత్తగా డిజిటల్ రూపీ తీసుకొస్తామని ప్రకటించారు. అలాగే డిజిటల్ కరెన్సీపై పన్ను విధించారు.
మొత్తంగా దేశ బడ్జెట్ ఏకంగా 17 లక్షల కోట్ల లోటులో ఉంది. అప్పులతోనే కేంద్రం కూడా బండి నడిపించే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనూ గొప్పగా ప్రచారం చేసుకునేలా ఎలాంటి ప్రాజెక్టులు ప్రకటించలేదు. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్లో రంగు, రుచి, వాసన కనిపిచంలేదని చెప్పుకోవచ్చు.