ఒకటో తేదీ వచ్చిందంటే వాలంటీర్లు పొద్దు పొద్దునే లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి రూ. 2500 పెన్షన్ చేతిలో పెట్టి ఫోటో తీసుకుని ప్రభుత్వ పబ్లిసిటీ సెల్‌కు పంపేవాళ్లు. అక్కడ నుంచి గంట గంటకు ఎంత మందికి పంపిణీ చేశారో లెక్కలు వైసీపీ అధికారిక మీడియాలో ప్రత్యక్షమయ్యేవి. ఉదయం పది గంటలకల్లా 90 శాతం పంపిమీ చేసేశాం.. వాలంటీర్ల సేవలు ఎంతో గొప్పవి అనే సర్టిఫికెట్లు ఆ తర్వాత వచ్చేవి. అయితే ఇప్పుడు రెండు నెలల నుంచి ఆ పరిస్థితి కనిపించడం లేదు. గత నెలలో రూ. 250 పెంచిన ప్రభుత్వం ఏకంగా వారం రోజుల పాటు పంపిణీకి టైం నిర్దేశించుకుంది. వాలంటీర్లు వారం రోజుల పాటు అదే పనిలో ఉన్నారు.
బ్యాంకుల వద్దకు వెళ్లడం.. అందినంత డబ్బు తీసుకోవడం.. వెళ్లి లబ్దిదారులకు ఇవ్వడంతోనే సరిపోయింది. ఈ నెల కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకటో తేదీ కూడా 70 శాతం ప్రాంతాల్లో వాలంటీర్ల చేతికి డబ్బులు అందలేదు. దీంతో వారు పంపిణీ చేయలేదు. దీంతో లబ్దిదారులు వాలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం కామన్‌గా కనిపిస్తోంది. ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడే ఎందుకు వస్తుందో లబ్దిదారులకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం వద్ద డబ్బులేదేమో అని ఆందోళన చెందుతున్నారు.
వారి ఆగ్రహానికి వాలంటీర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం డబ్బులిస్తుంది.. తాము తీసుకొచ్చి ఇస్తాము అంతే తప్ప.. తమకేం సంబంధం అని .. వారు గొణుక్కుంటున్నారు. అయితే ప్రభుత్వం పించన్ల సొమ్ము ముంజూరు చేశామని ప్రకటిస్తోంది.. కానీ బ్యాంకుల్లో మాత్రం జమ కావడం లేదు. ప్రభుత్వం సేఫ్ గేమ్ ఆడుతోంది. వాలంటీర్లు బలైపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.