ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు పారిశ్రామిక సంస్థల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతూనే ఉంది. కాలుష్యం పేరుతో అప్పటికప్పుడు పరిశ్రమల్ని మూసేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదేం పద్దదన్న ప్రశ్న వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. కడప జిల్లాలో తాజాగా దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇదే తరహా ఆదేశాలిచ్చారు. స్పందన కార్యక్రమంలో ఆ పరిశ్రమ వల్ల కాలుష్యం వస్తోందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారని వెంటనే క్లోజర్ ఆదేశాలిచ్చారు.
దాల్మియా సిమెంట్ ఇదేం పద్దతి కాదని.. ప్రభుత్వం ఏదో ఉద్దేశంతో ఇలా చేస్తోందని హైకోర్టులో పిటిషన్ వేసి.. అప్పటికప్పుడు కార్యకలాపాలు కొనసాగించుకునే అవకాశం తెచ్చుకుంది. కానీ కోర్టుల చుట్టూతిరుగుతూనే ఉంది. కడపలో ఓ సిమెంట్ పరిశ్రమకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది ఏప్రిల్లో జువారీ సిమెంట్స్ పరిశ్రమను ప్రభుత్వం మూసి వేయించింది. ఆఫ్యాక్టరీ యాజమాన్యం తాము అన్ని రకాల కాలుష్య నియంత్రణ పద్దతులు పాటిస్తున్నామని వాదించినా పట్టించుకోలేదు. చివరికి న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది.
అదే కడపలో సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతిసిమెంట్స్ పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమ వల్ల జరిగే కాలుష్యంపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఇతర సిమెంట్ ఫ్యాక్టరీలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అక్కడి జనానికీ అర్థం కావడం లేదు. మొత్తంగా చూస్తే కడపలో ఏమి ఉన్నా.. అవి ఇతరులవి కాకూడదన్న రూల్ ఏమైనా అమలు చేస్తున్నారేమోనన్న అనుమానం ఈ పరిణామాలు అనుసరించే వారికి రాకుండా ఉండదు.